News

Ys Jagan,ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతిని చులకన చేసిన అమెరికా అధికారి.. కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ – cm ys jagan letter to union foreign minister s jai shankar over us cop laughing ap student jaahnavi kandula death


అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి జనవరి 23న రోడ్డు దాటుతూ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆమె జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడిన అతడి అమానవీయ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీఎం కోరారు.

‘‘అమెరికాలోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్శిటీ సీటెల్‌ క్యాంపస్‌లో ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న కందుల జాహ్నవి పోలీస్‌ వాహనం ఢీకొట్టి ప్రాణాపాయానికి గురైంది.. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జాహ్నవి కుటుంబాన్ని, అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌ను సంప్రదించి మృతదేహాన్ని కర్నూలు జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆమె స్వగ్రామానికి అంబులెన్స్‌ కూడా సమకూర్చింది.

తాజాగా కందుల జాహ్నవి కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్‌ అధికారి (సీటెల్‌ పోలీస్‌ అధికారి) ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్నట్లు వచ్చిన వీడియోను అందరూ గమనించే ఉంటారు.. ఆ వీడియోలో ఒక అమాయక విద్యార్ధి జీవితాన్ని తక్కువ చేసి ఆయన మాట్లాడారు.. నాన్-అమెరికన్ పౌరుల పట్ల అలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను అందరూ ఖండించాలి.. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలి.. భారతీయులలో విశ్వాసం, భరోసా కల్గించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను..

ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని అభ్యర్ధిస్తున్నాను.. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నాను.. అమెరికాలోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీసి మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి… భారత్‌లోని అమెరికా రాయబారితో కూడా చర్చించి తగిన సూచనలివ్వాలి.. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని సీఎం జగన్ తన లేఖలో కోరారు. మరోవైపు, ఈ ఘటనపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. బాడీ క్యామ్ ఫుటేజ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది.

Read More Andhra Pradesh News And Telugu News

Related Articles

Back to top button