News

WPL 2023-GG vs MI: టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ముంబై ఆల్‌రౌండ్ షో.. గుజరాత్‌పై 143 పరుగుల తేడాతో భారీ విజయం.. | Mumbai Indians beat Gujarat Giants by 143 runs in Women’s Premier League inaugurating season


గుజరాత్‌ జెయింట్స్‌ టాప్ ఆర్డర్ పేకల మేడలా కూలిపోవడంతో.. తర్వాత వచ్చినవారిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా వారు కూడా చేతులెత్తేయడంతో గుజరాత్ జట్టు 143 పరుగుల భారీ తేడాతో..

WPL 2023-GG vs MI: టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ముంబై ఆల్‌రౌండ్ షో.. గుజరాత్‌పై 143 పరుగుల తేడాతో భారీ విజయం..

Mumbai Indians beat Gujarat Giants by 143 runs in WPL inaugurating season

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్) ఆరంభ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌ జట్టును చిత్తు చిత్తుగా ఓడించి డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ కూడా అద్భుతంగా చేసింది ముంబై. బౌలింగ్‌లో అయితే గుజరాత్ జట్టు బ్యాటర్లను కట్టడి చేసి.. ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఆరంభం నుంచే వికెట్లు తీస్తూ.. గట్టిగా దెబ్బకొట్టింది. గుజరాత్‌ జెయింట్స్‌ టాప్ ఆర్డర్ పేకల మేడలా కూలిపోవడంతో.. తర్వాత వచ్చినవారిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా వారు కూడా చేతులెత్తేయడంతో గుజరాత్ జట్టు భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. చివరాఖరకు గుజరాత్‌పై ముంబై  జట్టు 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. ఉమెన్స్ ఐపీఎల్‌ టోర్నీని ఘనంగా ప్రారంభించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఈ క్రమంలో ముంబై కెప్టన్ హర్మన్‌ ప్రీత్( 30 బంతుల్లో 65 పరుగులు; 14 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టింది. ఆమెతో పాటు మాథ్యూస్‌ (47), అమేలియా (45*) కూడా రాణించడంతో.. ముంబై టీమ్ భారీ స్కోర్ చేయగలిగింది.

అయితే ఆట ప్రారంభంలో ఓపెనర్‌ యాస్తికా భాటియా ఒకే ఒక్క పరుగు చేసి ఔటయింది. కానీ భాటియాతో వచ్చిన మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ మాత్రం.. తర్వాత వచ్చిన నాట్ సీవర్(23)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అయితే అలా ధాటిగా ఆడే క్రమంలో 47 పరుగులు చేసి ఔట్ అయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్.. గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టేలా. కేవలం 30 బాల్స్‌లోనే 65 రన్స్ చేసి.. డబ్ల్యూపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ కొట్టింది. 17వ ఓవర్లో హర్మన్ ఔటయినా.. అమేలియా, పూజ ధాటిగా ఆడడంతో ముంబై స్కోర్ 200 దాటింది. గుజరాత్‌ బౌలర్లలో స్నేహ్‌ రాణా రెండు వికెట్లు తీయగా.. గార్డ్‌నర్‌, తనుజా, జార్జియా తలో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 15.1 ఓవర్లలో 64 పరుగులు చేసి.. 9 వికెట్లు కోల్పోయింది.  గుజరాత్ జెయింట్స్ జట్టు.. ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. హేమలత(29), మోనికా పటేల్(10) తప్ప ఏ ఒక్కరూ.. రెండంకెల స్కోర్‌ కూడా చేయలేదు.

ఇవి కూడా చదవండి



నిజానికి గుజరాత్ జట్టుకు తొలి ఓవర్‌లోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మొదటి ఓవర్ నాలుగో బంతికే కెప్టెన్ బెత్ మూనీ కాలు మడతపడి.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. అదే ఓవర్ చివరి బంతికి హర్లీన్ డియోల్ డకౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా.. వచ్చినోళ్లు వచ్చినట్లుగానే వెనుతిరిగారు. రెండో ఓవర్‌లో గార్డ్‌నర్, మూడో ఓవర్‌లో మేఘన, ఐదో ఓవర్లో సుథర్‌లాండ్, ఏడో ఓవర్‌లో జార్జియా వారెహం, ఎనిమిదో ఓవర్‌లో స్నేహ్ రాణా ఔట్ అయ్యారు. హేమలత, మోనికా మాత్రమే  డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. హేమలత ఒకవైపు ధాటిగా ఆడుతున్నా.. మరోవైపు వరుసగా వికెట్లు పడడంతో.. ఆమె చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. చివరకు 143 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ముంబై బౌలర్లలో ఇషాక్‌కు 4 వికెట్లు తీసి సత్తాచాటింది. షివర్ బ్రంట్ 2,  కెర్ 2 వికెట్లు తీయగా.. వాంగ్ ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు  బెంగళూరు, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. రాత్రి ఏడున్నర గంటలకు యూపీ, గుజరాాత్ మధ్య మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button