Womens Reservation Bill,Cabinet Meeting: మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కీలక బిల్లుకు కేబినెట్ ఆమోదం! – womens reservation bill cleared in key cabinet meeting say sources
ఈ క్రమంలోనే చివరి నిమిషం వరకు కూడా అసలు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో బయట పెట్టకపోవడం కూడా ఊహాగానాలకు మరింత ఆస్కారం ఇచ్చినట్లయింది. అయితే ఇటీవల ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండా బయటికి చెప్పినా.. ఇంకా ఏవో కీలక బిల్లులు కూడా చివరి క్షణంలో సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరగ్గా ఇందులో సంచలన బిల్లుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. అదే మహిళా రిజర్వేషన్ బిల్లు అని విశ్వసనీయ వర్గాల ద్వారా విషయం బయటికి వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. కీలకమైన మహిళ రిజర్వేషన్ల బిల్లుకు ఈ మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బయటికి వచ్చింది. ఇది చట్టంగా మారితే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే వీలు ఉంటుంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం దేశవ్యాప్తంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళ రిజర్వేషన్ల బిల్లు ఎన్నో ఏళ్లుగా నానుతూనే ఉంది. 1996 లో అప్పుడు అధికారంలో ఉన్న హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ముందుగా ఈ మహిళ రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల కాలంలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టినా అది లోక్‌సభలో ఆమోదం పొందలేదు. చివరకి ఆ బిల్లు 2010 లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్‌లోనే ఉండడంతో అది చట్టంగా మారలేకపోయింది. ఇక 2014 లో లోక్‌సభ రద్దు కావడంతో మహిళ రిజర్వేషన్ల బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. ఈ నిర్ణయం తీసుకోవడం కీలక పరిణామంగా మారింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఈ ప్రత్యేక సమావేశాల్లో ఇంకా ఎలాంటి బిల్లులు తీసుకువస్తారోనని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది.
Read More Latest National News And Telugu News