Women Reservation Bill 2023,మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2029 ఎన్నికలతో అమల్లోకి! – womens quota only by 2029 details of new women reservation bill
ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉండగా.. 78 మంది మహిళలు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా.. కేవలం 24 మంది మాత్రమే మహిళలు. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించి, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. కానీ, ఈ చట్టం 2029 ఎన్నికల నుంచే అమలుకానుంది. నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ తర్వాత ఇది అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆమోదం పొందినా 2029లోపు అమలు సాధ్యం కాదు. ఎందుకంటే నియోజకవర్గాల విభజన, చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మొదటి జనగణన అనంతరం మాత్రమే సాధ్యమవుతుంది. జనగణన 2027లో జరిగే అవకాశం ఉంది.
బిల్లులో షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఇతర వెనుకబడిన తరగతులకు కల్పించలేదు. ఈ కోటా రాజ్యసభ లేదా రాష్ట్ర శాసనమండలికి వర్తించదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడో వంతు సీట్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మహిళలతో భర్తీ చేయాలి.
మహిళా రిజర్వేషన్ బిల్లులోని నిబంధనలు రాజ్యాంగం (128 వ సవరణ) చట్టం 2023 ఆమోదం పొందిన అనంతరం మొదటి జనగణన, నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత అమలులోకి వస్తుంది. ఇది 15 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ‘ఆర్టికల్ 239A.A, 330A, 332A నిబంధనలకు లోబడి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ, దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు రిజర్వు చేసిన సీట్లు పార్లమెంట్ చట్టం ఆమోదం ఉన్నంత వరకూ కొనసాగుతాయి’ అని బిల్లులో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ రిజర్వ్‌డ్ స్థానాల్లో మార్పులు చేయాలని పొందుపరిచారు. అయితే, ఈ మహిళా కోటా బిల్లు మాత్రం కేవలం 15 ఏళ్లే అమల్లో ఉంటుందని స్పష్టంగా అందులో పేర్కొనడం గమనార్హం.
Read More Latest National News And Telugu News