SEBI On Arshad Warsi: నిషేధం, జరిమానాపై లబోదిబోమంటున్న అర్షద్.. స్టాక్‌మార్కెట్‌లో పంప్ అండ్ డంప్ స్కామ్..
ఈ కంపెనీ షేరు పెరగబోతోంది, ఈ కంపెనీ షేరు ఆకాశాన్ని అంటబోతోందని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరిగే ప్రచారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ఆ ప్రచారం తప్పుడు ప్రచారం కావచ్చు, తప్పుదారి పట్టించే ప్రయత్నమూ కావచ్చు.
తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ATM పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. హిందీలో ఆ పాత్రను అర్షద్ వార్షి పోషించారు. అందులో ఆ పాత్ర పేరు సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్ చిక్కుల్లో పడ్డారు. రీల్ లైఫ్‌లో మున్నాభాయ్‌కు ఇచ్చిన సలహాలు వర్కౌట్ అయ్యాయేమో కాని రియల్ లైఫ్‌లో ఆయన ఇచ్చిన సలహాలు ఇప్పుడు ఆయన జేబుకు చిల్లుపెట్టాయి. భక్తి, అధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే ప్రముఖ టీవీ ఛానెల్ సాధనకు సంబంధించిన వ్యవహారాల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు అర్షద్‌పై నిషేధం విధించింది.
అంతే కాదు ఆ స్టాక్ వ్యవహారంలో సంపాదించిన మొత్తాన్ని వెనక్కితీసుకుంది. ఈ లావాదేవీల్లో అర్షద్ వార్సి 29.43 లక్షల రూపాయలు, ఆయన భార్య మారియ 37.58 లక్షల లాభం పొందినట్టు సెబీ గుర్తించింది. ఈ మొత్తాన్ని సెబీ స్వాధీనం చేసుకుంది.
నాకు నా భార్యకు స్టాక్ మార్కెట్ తెలియదు
మరో వైపు సెబీ విధించిన నిషేధం, జరిమానాపై అర్షద్ లబోదిబోమంటున్నారు. తనకు, తన భార్యకు స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి పరిజ్ఞానం లేదని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఎవరో సలహా తీసుకొని పెట్టుబడి పెడితే ఇప్పుడు తమ కష్టార్జితమంతా పోయిందని వివరణ ఇచ్చుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అర్షద్ వార్సీ రూ.29.34 లక్షలు, మరియా రూ.37.56 లక్షలు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది.
Please do not believe everything you read in the news. Maria and my knowledge about stocks is zero, took advice and invested in Sharda, and like many other, lost all our hard earned money.
— Arshad Warsi (@ArshadWarsi) March 2, 2023
ఈ షేర్ అనూహ్యంగా..
సాధన బ్రాడ్‌కాస్ట్ సంస్థ 1994లో ఏర్పాటైంది. ఈ సంస్థ జనవరి 18, 2018న స్టాక్‌మార్కెట్‌లో లిస్టైంది. గతేడాది ఏప్రిల్- జూలై మధ్య కాలంలో ఈ కంపెనీ షేర్లలో హడావుడి మొదలైంది. ఈ కంపెనీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతోందని, టీవీ ప్రొడక్షన్ నుంచి సినిమా ప్రొడక్షన్ వైపు సాధన గ్రూప్ వెళ్తోందని రెండు యూట్యూబ్ ఛానెల్స్‌లో జోరుగా ప్రచారం జరిగింది. తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ ఛానెల్స్ రెకమండెషన్స్‌తో ఈ షేర్ అనూహ్యంగా పెరిగింది.
రూపాయి 77 పైసల నుంచి 34 రూపాయల 80 పైసలకు
మార్చి 2022లో ఒక రూపాయి 77 పైసలున్న ఈ షేర్, యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రచారం కారణంగా ఆగస్టు 16 నాటికి 34 రూపాయల 80 పైసలకు పెరిగింది. ఇదే అదనుగా ఈ సంస్థ ప్రమోటర్లు తమ షేర్లు అధిక ధరలను అమ్ముకొని లాభాలు స్వీకరించారు. అర్షద్ వార్షి, ఆయన భార్య కూడా ఇలా లాభాలు దండుకున్న వారిలో ఉన్నారు. ఈ షేర్లను ప్రమోట్ చేయడంలో వీళ్లు కూడా కీలకంగా వ్యవహరించారు.
వీడియోలపై వేటు..
ఏయే రోజుల్లో అయితే ఈ షేర్లు కొంటే లాభాల పండగని ఆ యూట్యూబ్ ఛానెల్స్ ప్రచారం చేశాయో ఆ వీడియోలను ఆ తర్వాత తొలగించినట్టు సెబీ గుర్తించింది. ఏయే రోజు ఏమేం జరిగిందో, ఎప్పుడెప్పుడు ఎవరెవరకు ఎన్నెన్ని షేర్లు కొన్నారో అ వరాలన్నీ పొందుపరుస్తూ సెబీ ఏకంగా 58 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. 19 రూపాయలున్న షేర్ 340 రూపాయలకు చేరుతుందని ఈ యూట్యూబ్స్ ఛానెల్స్ ఊదరగొట్టాయి. ఆ వీడియోను రిట్రీవ్ చేసిన సెబీ దాన్ని తన ఆదేశంలోపొందుపరిచింది. మీరు చూస్తున్న వీడియో అదే. ప్రస్తుతం సాధన బ్రాడ్‌క్యాస్ షేరు ధర రూ. 5. 26 పైసలు పలుకుతోంది. ఈ సంస్థను ప్రమోట్ చేసిన అందరిపైన సెబీ నిషేధం విధించింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి