Entertainment

Multiplex: దేశంలో భారీగా మూత పడబోతున్న మల్టీప్లెక్స్‌ల వెనక అసలు రహస్యమేంటి..?


తీసేది రొటీన్ కంటెంట్.. వచ్చేది యావరేజ్ సినిమాలు.. టికెట్ రేట్ మాత్రం 300 నుంచి మొదలు..! పైగా పాప్ కార్న్‌ను ముట్టుకుంటే ఇంకో 300 మటాష్..! థియేటర్ లోపల బొమ్మ చూడకముందే.. బయటే రేట్లతో హార్రర్ బొమ్మ చూపిస్తున్నాయి మల్టీప్లెక్సులు. ఇప్పుడిదే వాటికి శాపమైందా.. దేశంలో భారీగా మూత పడబోతున్న మల్టీప్లెక్స్‌ల వెనక అసలు రహస్యమేంటి..? రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది..?

కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. మల్టీప్లెక్సులు నడవకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అసలే ఈ మధ్య రొటీన్ కంటెంట్‌తో థియేటర్లకు జనం రావడం మానేసారంటే.. టికెట్ రేట్ మొదలవ్వడమే 300 రూపాయలతో ఉంది. ముంబై, ఢిల్లీ లాంటి చోట మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు రూ 600 పైగానే ఉన్నాయి. ఇంత భారీ రేట్ పెడితే.. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లేగా అంటున్నారు విశ్లేషకులు.

మల్టీప్లెక్స్‌లలో అగ్రస్థానంలో ఉన్న PVR సంస్థ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోవడంతో మరో ఆప్షన్ లేక రాబోయే ఆర్నెళ్లలో దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించింది. 2023 జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో పీవీఆర్‌- ఐనాక్స్‌కు దాదాపు రూ. 333 కోట్ల నష్టం వచ్చినట్లు పేర్కొన్నారు. గతేడాది కేజియఫ్ 2, ట్రిపుల్ ఆర్ రావడంతో.. నష్టాలు 100 కోట్ల మేర మాత్రమే వచ్చాయి.

మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం.. ఆదాయం మాత్రం అందులో సగం కూడా లేకపోవడం.. పైగా బాలీవుడ్ సినిమాలు దారుణంగా బోల్తా కొట్టడం.. హాలీవుడ్ సినిమాల ప్రభావం తగ్గిపోవడంతో.. నష్టాలు దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఓటీటీల ఎఫెక్ట్ ఉంది. అందుకే నష్టాల్లో నడుస్తున్న దాదాపు 50 స్క్రీన్స్‌ను మూసివేయాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది పఠాన్, కేరళ స్టోరీ మాత్రమే బాలీవుడ్‌ను కాపాడాయి.

ఏడాది క్రితం PVR, ఐనాక్స్‌ లీజర్‌ సంస్థలు విలీనంతో దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్‌ సంస్థగా అవతరించారు. భారత్‌, శ్రీలంకలో మొత్తం 1689 మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లు నడుపుతుంది PVR Inox. గతేడాది కొత్తగా 168 స్క్రీన్‌లను ఓపెన్‌ చేయగా.. మరో 175 స్క్రీన్‌లకి ప్లాన్ చేసింది. అంతలోనే తీవ్ర నష్టాల నేపథ్యంలో ఉన్న స్క్రీన్స్ మూసేస్తున్నారు. టికెట్ రేట్లు తగ్గించి.. మంచి సినిమాలు వస్తే కానీ వీటికి మళ్లీ పునర్వైభవం రాదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button