News
warangal yoga centre, వరంగల్‌లో అంతర్జాతీయ యోగా కేంద్రం.. వారసత్వ భూమిని అప్పగించిన మంత్రి – international yoga center to come up in warangal under sri ramachandra mission
International Yoga Centre: వరంగల్‌లో అంతర్జాతీయ యోగా కేంద్రం ఏర్పాటు కానుంది. శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఈ యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు యోగా కేంద్రానికి తన వారసత్వ భూమిని అప్పగించారు. నెక్కొండ మండలం రెడ్లవాడ, గొట్లకొండ గ్రామాల మధ్య ఉన్న దాదాపు 180 ఎకరాలకు భూమికి సంబంధించిన పత్రాలను కొలను వేంకటేశ్వర స్వామి ట్రస్టు, ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్‌కు అందజేశారు.
తరతరాలుగా తమకు వారసత్వంగా వస్తున్న భూమిని అంతర్జాతీయ యోగా కేంద్రం ఏర్పాటు కోసం ఇవ్వటం ఆనందంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతోనే తాను ఈ మహత్కార్యానికి సిద్ధమైనట్లు చెప్పారు. యోగా గొప్ప జీవన విధానమని.., ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత, ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి యోగా మూలమని మంత్రి వ్యాఖ్యనించారు.
మంత్రి ఎర్రబెల్లి సహకారంతో జిల్లాలో అంతర్జాతీయ యోగా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని కమలేష్ డి పటేల్ దాజీ చెప్పారు. శ్రీరామచంద్ర మిషన్‌ను తెలంగాణలో విస్తరించాలన్న ఆలోచనను మంత్రి ఎర్రబెల్లికి తెలియజేయగానే.. భూమిని అందించారన్నారు. మంత్రికి, ఎర్రబెల్లి ట్రస్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అన్ని సౌకర్యాలతో అంతర్జాతీయ యోగా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.