News

vijayashanti, Balakrishna: విజయశాంతి ఊర్వశా రాక్షసా.. బాలకృష్ణకు అల్లు శిరీష్ కొంటె ప్రశ్న.. సమాధానం అదిరింది! – allu sirish naughty question to nandamuri balakrishna about vijayashanti


అల్లు, నందమూరి కుటుంబాల మధ్య అనుబంధం ఈనాటిది కాదని నందమూరి బాలకృష్ణ ఇప్పటికే చెప్పారు. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో లాంచింగ్ టైమ్‌లో తమ ఇరు కుటుంబాల బాంధవ్యాన్ని వివరించారు. నిజానికి ఈ రెండు కుటుంబాల మధ్య ఇంత క్లోజ్‌నెస్ ఉందని అప్పటి వరకు చాలా మందికి తెలీదు. ‘అన్‌స్టాపబుల్’ షో తరవాత అల్లు ఫ్యామిలీకి బాలకృష్ణ మరింత దగ్గరైనట్టు అందరికీ అనిపిస్తోంది. ఇప్పుడు ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయడంతో మరింత చర్చనీయాంశమైంది. సాధారణంగా వేరే సినిమా ఫంక్షన్లకు పెద్దగా వెళ్లని బాలకృష్ణ.. అల్లు అరవింద్ కొడుకు సినిమా ఫంక్షన్‌కు వెళ్లారంటే వారి బంధం ఎంత బలపడిందో అర్థమవుతోంది.

ఇదిలా ఉంటే, ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన నందమూరి బాలకృష్ణను అందరి సమక్షంలో అల్లు శిరీష్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యమైనది ఊర్వశి ఎవరు? రాక్షసి ఎవరు? అనే ప్రశ్న ఆసక్తికరంగా ఉంది. బాలకృష్ణతో నటించిన నలుగురు హీరోయిన్ల పేర్లను అల్లు శిరీష్ చెప్పారు.. వీరిలో ఊర్వశి ఎవరు? రాక్షసి ఎవరు? చెప్పాలని బాలయ్యను అడిగారు. దానికి నటసింహం సరే అన్నారు. అయితే, అల్లు శిరీష్ మొదట అడిగిన హీరోయిన్ పేరు విజయశాంతి. బాలకృష్ణతో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ ఈమె. ఈవిడ ఊర్వశా, రాక్షసా అని ప్రశ్నించారు అల్లు శిరీష్. కానీ, బాలయ్య సమాధానం చెప్పలేదు. మిగిలిన హీరోయిన్ల పేర్లు కూడా చెప్పు.. అప్పుడు చెప్తా నా సమాధానం అని మెలిక పెట్టారు.

దీంతో అల్లు శిరీష్ వరుసగా.. విజయశాంతి, సిమ్రన్, నయనతార, శృతిహాసన్ పేర్లు చెప్పారు. బాలయ్య చాలా తెలివిగా ఊర్వశి సిమ్రన్.. రాక్షసి శృతిహాసన్ అని చెప్పారు. మరి మిగిలిన ఇద్దరు హీరోయిన్లు సార్ అని శిరీష్ అడగానే.. ‘‘అయిపోయిందిగా. ఇద్దరినే అడిగావ్. ఇక తిలోత్తమా, రంభ అవన్నీ వేరు. నువ్వు వాళ్ల గురించి అడగలేదు’’ అంటూ బాలయ్య తప్పించుకున్నారు. సింహం గర్జించడంతో శిరీష్ కూడా కామ్ అయిపోయారు. ఆ తరవాత ‘సింహ’ అనే టైటిల్‌తో వచ్చిన హిట్ సినిమా పేర్లను శిరీష్ వరుసగా చెప్పారు. అయితే, ఇంకో సినిమా మిస్ అయ్యింది.. అదేంటో చెప్పగలరా అని బాలయ్యను అడిగారు. బాలయ్య వెంటనే ‘బొబ్బిలి సింహం’ అని చెప్పారు. శిరీష్ అది కాదని.. ‘సింహం నవ్వింది’ అనే ఒక సినిమా మీరు చేశారని గుర్తు చేశారు. ‘‘సింహం నవ్వింది.. అందుకే పోయింది ఆ సినిమా’’ అంటూ బాలయ్య పంచ్ వేశారు. మొత్తానికి శిరీష్-బాలకృష్ణ ఇంటరాక్షన్ చాలా ఫన్నీగా సాగింది.

బాలకృష్ణకు ప్రశ్నలు సంధించిన అల్లు శిరీష్.. సింహంతో ఆట మామూలుగా ఉంటుందా..!

Related Articles

Back to top button