News

Vietnam Fire Accident,మాటలకందని విషాదం.. అపార్ట్‌మెంట్ భవనంలో అగ్ని ప్రమాదం.. 54 మంది సజీవదహనం – three children among more than 50 killed after massive apartment fire in hanoi of vietnam capital


ఓ అపార్ట్‌మెంట్ భవనంలో అర్ధరాత్రి వేళ ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి.. 50 మందికిపైగా సజీవదహనమయ్యారు. డజన్లు కొద్దీ గాయపడ్డారు. అత్యంత భయంకరమైన ఈ దుర్ఘటన వియత్నాం రాజధాని హనోయిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మంటల్లో కాలిపోతున్న బాధితుల ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. అర్ధరాత్రి వేళ కొంతమంది నిద్రలో ఉండగా.. మరి కొందరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తొమ్మిదంతస్తుల భవనం మంటల్లో కాలిపోయింది.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో పదంతస్తుల భవనం పార్కింగ్ ఫ్లోర్‌లో తొలుత మంటల చెలరేగాయి. అక్కడ నుంచి పైన ఉన్న 9 అంతస్తులకు ఇవి వ్యాపించాయి. రాత్రి సమయం కావడంతో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. ఆ భవనంలో మొత్తం 45 కుటుంబాలకు చెందిన 150 మంది వరకూ నివాసం ఉంటున్నారు. ఇరుకైన ప్రదేశంలో భవనం ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మంటల్లో చిక్కుకున్న చాలా మంది బయటపడలేక సజీవదహనమయ్యారు.

క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించగా.. ఇప్పటి వరకు 54 మంది చనిపోయినట్టు అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో కనీసం ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలిపాయి. ప్రమాదం రాత్రి సమయంలో జరగడం వల్ల ప్రాణనష్టం అధికంగా ఉంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తొలుత పార్కింగ్ ఫ్లోర్‌లో మంటలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాధితుల హహాకారాలతో ఆ ప్రాంతం భీతావాహంగా మారింది. మొత్తం 74 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ప్రమాద స్థలికి సమీపంలో ఉన్న ఓ మహిళ మాట్లాడుతూ.. సాయం కోసం బాధితులు కేకలు వేశారు కానీ మేము ఎక్కువ మందిని రక్షించలేకపోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్‌‌మెంట్ ఇరుకైన స్థలంలో ఉందని, తప్పించుకోడానికి బాధితులకు అవకాశం లేకపోయిందన్నారు.

అపార్ట్‌మెంట్ భవనంలో చుట్టూ ఇనుప గ్రిల్స్ ఉన్న చిన్న చిన్న బాల్కనీలతో పాటు ఒకే ఒక నిష్క్రమణ ద్వారం ఉందని, కనీసం బయట ఎమర్జెన్సీ మెట్లు కూడా లేవని అధికారులు పేర్కొన్నారు. మంటల నుంచి తప్పించడానికి ఒక చిన్న పిల్లవాడిని పై అంతస్తు నుంచి విసిరేశారని మరో వ్యక్తి చెప్పారు. ‘నేను నిద్రలో ఉండగా ఏదో కాలిన వాసన రావడంతో బయటికి వెళ్లేసరికి మంటలు వ్యాపించాయి’ అని ఆమె చెప్పింది.

ఇటీవల కొన్నేళ్లుగా వియత్నాంలో ఘోరమైన అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏడాది కిందట వియత్నాం వాణిజ్య నగరం హో చి మిన్హ్‌లోని ఓ బార్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 32 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. అదే నగరంలో 2018లో ఓ అపార్ట్‌మెంట్ భవనంలో మంటలు చెలరేగి 13 మంది సజీవదహనమయ్యారు.

Read More Latest International News And Telugu News

Related Articles

Back to top button