రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు ర్యాగింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూచించారు. హైదరాబాద్‌లో మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో మంత్రి విడదల రజిని సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ర్యాగింగ్ భూతం విషయంలో అన్ని మెడికల్ కళాశాలలు కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. కళాశాలల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుగ్గా పని చేయాలన్నారు. ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. ఆయా కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలని సూచించారు. విద్యార్థులతో బోధనా సిబ్బంది సహృద్భావంతో ఉండాలన్నారు. కొంత మంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్‌లు నడుపుకుంటూ పీజీ విద్యార్థులపై పని భారం మోపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పద్ధతి మారాలన్నారు.
చదువుల్లో నాణ్యతే కాదని, భద్రత కూడా ఉండాలని మంత్రి విడదల రజిని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారానే మెడికోలను సురక్షితంగా సమాజంలోకి తీసుకురాగలమని చెప్పారు. అన్ని మెడికల్ కళాశాలల్లోనూ విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేలా విద్యార్థులకు యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలని సూచించారు. కళాశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచాలన్నారు.