News

vennapusa ravindra reddy, ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు: వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి ఆరోపణలు – ysrcp mlc candidate alleagations on election counting


ఎన్నికల ఫలితాల లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సాధారణంగా విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తుంటారు. కానీ, అనంతపురంలో మాత్రం ఆధిక్యతలో ఉన్నప్పటికీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ఓట్ల లెక్కింపుపై ఫిర్యాదు చేశారు. కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల (పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనకు వచ్చిన ఓట్లను తెలుగు దేశం పార్టీ అభ్యర్థికి కలుపుతున్నారని వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు.

అయితే, ఓటమి భయంతో కౌంటింగ్‌ నిలిపివేయాలని మధ్యాహ్నం నుంచి వైసీపీ నేతలు కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ నాగలక్ష్మి లేకుండా.. జేసీ కేతన్‌ గార్గ్‌ ద్వారా కౌంటింగ్‌ పర్యవేక్షణ చేయించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

1,449 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి..
మరోవైపు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానానికి మొత్తం 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలైన 2,45,576 ఓట్లను లెక్కించే ప్రక్రియ సాగుతోంది. 8వ రౌండ్‌ లెక్కింపు పూర్తయిన తర్వాత వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 74,678 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 73,229 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు చెల్లని ఓట్లను 15,104 గుర్తించారు. మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి 1,449 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Related Articles

Back to top button