News

varla ramaiah, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాత శక్తి ఎవరు: వర్ల రామయ్య – tdp leader varla ramaiah comments on mp ys avinash reddy issue


కడప వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాత శక్తి ఎవరని తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. రాష్ట్ర సంక్షేమాన్ని విస్మరించి, అల్లకల్లోలంగా మారిన రైతుల వ్యథలు పట్టించుకోకుండా, తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని రక్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని ఆరోపించారు. ఇంతకీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఎప్పుడని నిలదీశారు.

ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోందని వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘నిన్ హైడ్రిన్ టెస్ట్’ పూర్తయితే వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్లు చెప్పబడుతున్న లేఖపై అసలు వేలిముద్రలు బయటపడతాయని, ఇంకొంత మంది ముద్దాయిలు వెలుగులోకి వస్తారన్నారు.

మరోవైపు దివంగత వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఓ వీరవనిత అని వర్ల రామయ్య కొనియాడారు. చరిత్రలో రాణి రుద్రమ, ఝాన్సీరాణి పోరాటం చేసిన శత్రువుల కంటే పెద్ద శత్రువుతో సునీత చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే వివేకా హత్య కేసు ముగిసిపోయినట్లు కాదని, ఇంకా విచారణ చేయాల్సింది చాలా ఉందన్నారు. ఈ హత్యలో కుట్రను బయటకు తీయాలని, ‘హూ కిల్డ్ బాబాయ్‌’ ఉదంతంలోని ముద్దాయిలంతా బయటపడాలన్నారు.

ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఈ రెండు సూత్రాలపై పోలీసు శాఖ పని చేయాలని వర్ల రామయ్య అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ శాఖ దారుణంగా పని చేస్తోందని దుయ్యబట్టారు.

ఇక, 2020లో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని చంపిన పోలీస్ అధికారి అలెగ్జాండర్‌కు తాను ఏమీ తీసిపోను అనే విధంగా శుక్రవారం కావలి డీఎస్పీ వెంకటరమణ తన రెండు మోకాళ్ల మధ్యలో ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్త సురేష్ తలను నొక్కడం హత్యాయత్నంతో సమానమని వర్ల రామయ్య అన్నారు. అమెరికాలో పోలీస్ అధికారి అలెగ్జాండర్‌కు శిక్షపడినట్టే, ఇక్కడ సురేష్‌పై హత్యాయత్నం చేసిన డీఎస్పీ వెంకటరమణకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కావలి డీఎస్పీ వెంకటరమణను వెంటనే అరెస్ట్ చేసి, దిగజారిపోతున్న వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను కొంతైనా కాపాడుకోవాలని హితవు పలికారు. కొంత మంది పోలీసు అధికారుల తీరు చాలా ఘోరాతిఘోరంగా ఉందని.. వారు చట్టబద్ధంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తోందని వర్ల రామయ్య పేర్కొన్నారు.

జగన్ వచ్చాక వింత పోకడలతో పరిపాలన: వర్ల రామయ్య

Advertisement

Related Articles

Back to top button