News

Vande Bharat Sleeper Coach,గుడ్ న్యూస్.. మరో ఆర్నెల్లలో వందేభారత్‌ స్లీపర్‌, మెట్రో.. వచ్చే నెల పేదల వందేభారత్ – vande bharat sleeper coach and vande metro to be rolled out by march 2024 says icf gm bg malya


కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ సెమీ-హైస్పీడ్ రైళ్లలో ప్రస్తుతం ఛైర్ కార్‌తోనే నడుస్తున్నాయి. త్వరలోనే వందే భారత్‌ స్లీపర్ కోచ్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్‌) జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. చెన్నైలో శుక్రవారం ‘వందే భారత్‌ – భవిష్యత్‌ రైలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన బీజీ మాల్యా మాట్లాడుతూ… పెరంబూర్‌ ఐసిఎఫ్‌ కర్మాగారం ఏడాదికి 3 వేల రైలు కోచ్‌లను తయారుచేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

భారతీయ రైల్వేకు మాత్రమే కాకుండా 14 దేశాలకు ఇక్కడ తయారైన బోగీలను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. రైల్వేల ఆధునీకరణలో భాగంగా 85 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్‌ రైళ్లను తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 25 వందేభారత్ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తున్నాయని, మరో 10 రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని మాల్యా చెప్పారు. అలాగే, స్లీపర్ కోచ్ వందే భారత్‌ రైలు, వందే మెట్రో, వందే సరుకు రైలు తదితరాలు రూపొందించే పనిలో ఉన్నామని వివరించారు.

సుమారు 1,000 కి.మీ దూరానికి ఈ రైళ్లను నడపనున్నామని, ఆ ప్రకారం చెన్నై నుంచి ఢిల్లీకి 20 గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. వందే భారత్‌ రైళ్ల బరువు తగ్గించేలా అల్యూమినియంతో కొత్త వందే భారత్‌ రైళ్లు రూపొందిస్తున్నామన్నారు. తక్కువ దూరం ప్రయాణాల కోసం 12 కోచ్‌లతో వందేభారత్ రైలు జనవరి 2024కి అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

స్లీపర్ కోచ్‌లను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL), రష్యా TMH గ్రూప్ కన్సార్టియం సంయుక్తంగా తయారు చేస్తున్నాయి మొత్తం 200 వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లలో 120 సరఫరా చేయడానికి అత్యల్పంగా ఇది బిడ్ చేసింది. మిగిలిన 80 రైళ్లను టిటాగర్ వ్యాగన్లు, భెల్ (BHEL) కన్సార్టియం రూపొందించనున్నాయి. ఆర్వీఎన్‌లె్ జీఎం (మెకానికల్) అలోక్ కుమార్ మిశ్రా ఆగస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రతి వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఇందులో 16 బోగీలు ఉంటాయని పదకొండు థర్డ్ ఏసీ, నాలుగు సెకెండ్ ఏసీ, ఒకటి ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటుందని పేర్కొన్నారు. కోచ్‌ల సంఖ్యను 20 లేదా 24 వరకు పొడిగించవచ్చని ఆయన తెలిపారు.

ఇక, పేదల కోసం వందే భారత్‌ రైలుకు సమానమైన వేగంతో వెళ్లేలా ‘పుష్‌ పుల్‌ రైల్‌’ అక్టోబరు 23న అందుబాటులోకి రానుందన్నారు. పూర్తిగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన ఈ రైలు ఇరువైపులా ఉన్న విద్యుత్‌ ఇంజన్‌లతో నడుస్తాయన్నారు. తద్వారా వందే భారత్‌ రైలుకు సమానంగా సుమారు 130 కి.మీ వేగంతో వెళతాయని ఆయన తెలిపారు. అలాగే, ఏసీ సౌకర్యం కోరుకోని ప్రయాణికుల కోసం 22 పెట్టెలతో కూడిన స్లీపర్ వందేభారత్‌ రైలు సేవలు అక్టోబరు 31వ తేది నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button