News

tirumala darshan, Tirupati: చీమల దండులా తిరుమల కొండ.. దర్శనానికి 2 రోజుల సమయం – heavy rush continues at tirumala temple, devotees wait for over 48 hours for darshan


తిరుమల కొండ (Tirumala Temple) భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల క్యూలైన్ 6 కిలోమీటర్లు దాటిపోయింది. శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. భక్తులను క్యూలైన్లలోకి అనుమతించట్లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం సాయంత్రం క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. ఆహారం, తాగునీటి కొరతతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడటంతో మరింత ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భక్తులు సంయమనంతో వేచి ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం క్యూలైన్లలోకి ప్రవేశించాలని సూచించింది.

క్యూ కట్టిన తమిళ భక్తులు.. కారణమిదే
వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తమిళనాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారికి పెరటాసి మాసం మూడో శనివారం కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు.

క్యూలైన్లు నిదానంగా కదులుతుండటంతో ఆహారం సరఫరా చేసే ప్రాంతాలకు చేరడానికి భక్తులకు గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల అనుమతి నిలిపివేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తర్వాత క్యూలైన్‌లోకి ప్రవేశిస్తున్న భక్తులను శనివారం ఉదయం 6 గంటలకు రావాలని తిప్పి పంపుతున్నారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం రాత్రి గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రద్దీ పెరిగిందని అన్నారు. దర్శనానికి రెండు రోజుల సమయం పడుతుందని.. టీటీడీ ఏర్పాటు చేసిన ఆవాస కేంద్రాల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. భక్తులను ఆవాస కేంద్రాలకు ఉచిత బస్సుల ద్వారా పంపిస్తున్నామని తెలిపారు. పోలీసులు, అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.

Related Articles

Back to top button