News

telangana tdp, TTDP: తెలంగాణపై టీడీపీ ఫోకస్.. పక్కా ప్లాన్‌తో ముందుకు, ఈనెల 29న సభ – telangana tdp plan to organize tdp formation day


Telugu Desam Party: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్‌ను గద్దె దించి సీఎం కుర్చీని చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా… హ్యాట్రిక్ విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు అధికార పార్టీ ఉవ్విలూరుతోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో తన ఉనికిని చాటుకోవాలని తెలుగుదేశం పార్టీ యత్నిస్తుంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పార్టీ నేతలు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు.

గతేడాది చివర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తాము గట్టిపోటి ఇవ్వబోతున్నామనే సంకేతాలను తెలంగాణలోని అన్ని పార్టీలకు చంద్రబాబు పంపించారు. అక్కడి సభలో ప్రసంగించిన చంద్రబాబు.. పార్టీకి దూరమైన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఖమ్మం సభ సక్సెస్ కావటంతో తెలుగు తమ్ముళ్లోనూ జోష్ వచ్చింది. పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే పనిలో పార్టీ అధినాయకత్వం నిమగ్నమైంది.

పార్టీ అధినేత చంద్రబాబు డైరక్షన్‌లో.. తెలంగాణటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ముదిరాజ్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్విహిస్తూ.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిలో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే విధంగా వ్యుహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే ‘ఇంటింటికి తెలుగు దేశం’ కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. టీడీపీ హయంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతం చేసేందుకు కేడర్ కృషి చేస్తోంది.

ఇదిలా ఉండగా.. టీడీపీ 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈనెల 29న సభ నిర్వహణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఎన్నికలకు సమాయత్తం కావాలని భావిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు కాసాని వెల్లడించారు.

తెలంగాణలో అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణలుు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ప్రతినిధులకు స్వాగత ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన కూడళ్లను పసుపుమయం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మెుదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు ఈ సభకు హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button