Telangana Assembly Elections,నిన్న స్నేహితులు.. నేడు ప్రత్యర్థులు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు! – friends are contesting as opponents in the telangana assembly elections
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. తనకు టిక్కెట్ ఇవ్వలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీతో కలిసి పని చేసిన జగదీశ్వర్ గౌడ్.. ఇప్పుడు ఆయనకే ప్రత్యర్థిగా మారారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కె.ఎస్.రత్నం.. నెలరోజుల క్రితం వరకూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పార్టీలో పనిచేశారు. అయితే పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. బీజేపీలో చేరి యాదయ్యను ఓడించాలన్న లక్ష్యంతో పోటీలో నిలిచారు.
ఖైరతాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో సఖ్యతగానే ఉండేవారు. వచ్చే ఎన్నికల్లో దానంకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారన్న సమాచారంతో ఆమె కొద్దినెలల క్రితం కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం దానంకు ప్రత్యర్థిగా తలపడుతున్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కొద్దిరోజుల వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్‌రెడ్డితో కలిసి పనిచేశారు. తాజాగా ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు స్నేహితుడైన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత ఎన్నికల్లో జైపాల్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈసారి కసిరెడ్డి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. కట్ చేస్తే..కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్నేహితుడుకి వ్యతిరేకంగా బరిలో నిలిచారు. ఇలా మరికొన్ని నియోజవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నవారు, కలిసి తిరిగిన వారు నేడు ప్రత్యర్థులుగా మారి ఎన్నికల కదనరంగంలో దూసుకెళ్తున్నారు.