News

Telangana: మునుగోడులో మూడు పార్టీల మూడు ముక్కలాట.. గెలుపు పై ఎవరి వ్యూహాం వారిదే.. | BJP vs TRS vs Congress Will Munugode Bypoll Decide BJP and Congress Future in Telangana


తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే విడుదలవుతుందనే ప్రచారంతో అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. ఈఎన్నికలో గెలుపు కోసం..

Telangana: తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే విడుదలవుతుందనే ప్రచారంతో అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. ఈఎన్నికలో గెలుపు కోసం టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు తమదైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాకముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఎవరనే దానిపై పూర్తి క్లారిటీ ఉండగా.. టీఆర్ ఎస్ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగానే క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మొత్తం చుట్టేస్తూ.. ప్రజలందరినీ కలుసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ కు తామే పోటీ అని ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ కు పోటీ ఎవరనేది మునుగోడు ఉప ఎన్నికతో దాదాపు తేలిపోనుంది. వాస్తవానికి మునుగోడులో టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ బలం ఉంది. బీజేపీకి మాత్రం ఆర్ ఎస్ ఎస్, దాని పరివార్ సంస్థలకు చెందిన వ్యక్తులు మినహా క్షేత్రస్థాయిలో అంతగా బలం లేదు. కాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అభ్యర్థి కావడం బీజేపీకి ఈ నియోజకవర్గంలో కలిసొచ్చే అంశం. దానికి తోడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్, రఘునందన్ వంటి ఉద్యమ నేతలు బీజేపీలో ఉంటూ.. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులను కమలం పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కూడా తమపార్టీ గెలుపునకు దోహదం చేస్తుందనే నమ్మకంలో కమలం పార్టీ ఉంది. టీఆర్ ఎస్ మాత్రం అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుంది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమమే తమను గెలిపిస్తాయని నమ్ముతున్నప్పటికి.. ప్రజల మూడ్ రోజురోజుకు మారడం, ప్రభుత్వంపై అనేక అంశాల్లో పెరుగుతున్న వ్యతిరేకత తమకు నష్టం కలిగిస్తయనే భావనలోనూ టీఆర్ ఎస్ ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేయలేకపోయినా, అరకొరగా ఉన్న కమ్యూనిస్టులు టీఆర్ ఎస్ కు మద్దతు తెలపడం ఆపార్టీకి సానుకూలంశమే. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే తమకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉందని, నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని హస్తం పార్టీ భావిస్తోంది. రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినా.. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం విషయానికొస్తే కారు పార్టీ జోరు పెంచింది. అధికార టీఆర్‌ఎస్‌ జనం-వనం కార్యక్రమంతో దూసుకుపోతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ కూడా ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నాయి. తాజాగా  టిఆర్ఎస్… ఆత్మీయ సమ్మేళన వన భోజనాల కార్యక్రమం నిర్వహించింది. వందలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లను అమర్చే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశాన్నిమ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశాననే విషయాన్ని విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మునుగోడు ప్రజల తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పులకు కారణం అవుతుందన్నారు.

పేద ప్రజల సంకేమమే తమ పార్టీ లక్యమంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. కాంగ్రెస్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. మునుగోడు ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ విస్తృతంగా పాల్గొని తమ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు తమదైన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రజలు మాత్రం ఎటువైపు ఉన్నారనేది ఎన్నిక ఫలితం తర్వాతే తేలనుంది.

ఇవి కూడా చదవండిమరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..
.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button