News

Telangana: ‘నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దం’ కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్..


Kishan Reddy, Ktr

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై కిషన్ రెడ్డికి సవాలు విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. తన వ్యాఖ్యలను కాదని నిరూపిస్తే మంత్రి పదవీకి రాజీనామా చేస్తానంటూ సవాలు చేశారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన మొత్తమెంత? తిరిగి వచ్చింది ఎంత? అంటూ లెక్కలతో సహా వివరించారు.

తెలంగాణ రాజకీయం సవాళ్లు విసురుతుంది. వాస్తవాలు బయటపెడుతారా? లేదంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తారా అంటూ సవాలు విసిరారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయం హీటెక్కుతోంది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య వార్‌ ముదురుతోంది. సొమ్ము మాది, సోకు మీది అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులను బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధికి వాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇది వాస్తవం. కాదని నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం మరి మీరూ..

కొంత కాలంగా తెలంగాణ సర్కారు, కేంద్రం మధ్య వార్‌ నడుస్తోంది. మీరేం చేశారంటే, మీరేం చేశారంటూ ఇరు ప్రభుత్వాలు ప్రత్యర్థులపై బాణాలు విసురుతున్నాయి. అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ తమవి అంటే తమవని ఇరువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ డైలాగ్స్‌ కాస్తా పీక్స్‌కు చేరాయి. తాము కడుతున్న పన్నులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. కేంద్రానికి తాము 3 లక్షల 68 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తే.. రాష్ట్రానికి వచ్చింది లక్షా 68 వేల కోట్లే అంటూ లెక్కలతో సహా నల్గొండ పర్యటనలో వివరించారు.

తాము చెప్తున్నది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడేది లేదంటూ సవాలు విసిరారు. నిరూపించలేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయకపోయినా ఫర్వాలేదు కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా అంటూ కామెంట్ చేశారు. కేంద్రం గ్రామపంచాయతీలకు వేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందనేది కిషన్ రెడ్డి ఆరోపణ. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఇచ్చిన నిధులను మరో అవసరాలకు మళ్లించడం రాష్ట్ర ప్రభుత్వ దౌర్భగ్యానికి నిదర్శనమంటూ రెండు రోజుల క్రితం ప్రకటించారు. కేటీఆర్ సవాల్‌కు బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు? లెక్కలు వివరిస్తారా? సవాలు స్వీకరిస్తారా? వేచి చూడాలి.

Related Articles

Back to top button