News

tamilisai soundararajan, ‘కొత్త సచివాలయం అద్భుతం.. కానీ..’ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు – governor tamilisai soundararajan comments about parliament inauguration ceremony


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయం గురించి స్పందించిన గవర్నర్.. అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. అయితే.. సచివాలయ ప్రారంభోత్సవానికి మాత్రం తనను ఆహ్వానించలేదని తెలిపారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు.. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని.. ఆ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వాహనించలేదని చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశం వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో తమిళిసై చెన్నైలో స్పందించారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం కాంట్రవర్సీ అవుతోందన్నారు తమిళిసై. ప్రధాని మోదీ చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయని తమిళిసై తెలిపారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధంలేదని కూడా చెప్తున్నారన్నారు.
అయితే.. గవర్నర్లు కూడా రాష్ట్రపతి లాగానే.. రాజకీయేతర వ్యక్తులే కదా అని తమిళిసై ప్రస్తావించారు. తనను మాత్రం ఎందుకు సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదని.. ప్రశ్నించారు. రాష్ట్రపతికి వర్తించినట్టే.. గవర్నర్‌కు కూడా కొన్ని అంశాలు వర్తిస్తాయని మర్చిపోయారా అని చురకలంటించారు.

ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా తెలంగాణ సర్కారుకు, గవర్నర్ తమిళిసైకి మధ్య పొసగటం లేదు. పెండింగ్ బిల్లుల విషయంలో మొదలైన ఈ పంచాయితీ.. రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. బిల్లులు ఆమోదించకపోవటంతో తమిళిసైపై సర్కారు గుర్రుగా ఉండటంతో.. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందించట్లేదు. దీంతో.. తమిళిసై బహిరంగంగానే సర్కారుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగానే.. పెండింగ్ బిల్లులను గవర్నర్ సత్వరమే ఆమోదించేలా ఆదేశించాలంటూ కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ క్రమంలోనే.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపించలేదని టాక్ నడుస్తోంది.

మరోవైపు.. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై విపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించటాన్ని విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయేతరుడైన రాష్ట్రపతి ప్రారంభించాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు ప్రకటన విడుదల చేశారు.

సికింద్రాబాద్ నుంచి మూడో వందే భారత్ రైలు

సెల్లార్‌లో పాప మృతి కేసులో వెలుగులోకి సంచలన నిజాలు.. ఆ కారు మహిళా ఎస్సైదే.. కానీ..!

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button