News

taliban cancelled divorces, Taliban: అఫ్గన్‌లో మరో అరాచకం.. మహిళల విడాకులను రద్దుచేసి.. మాజీ భర్తలతోనే ఉండాలని ఆదేశం – taliban force divorced women back to abusive ex husbands in afghanistan


అమెరికా సైన్యం 2021 ఆగస్టులో వైదొలగిన తర్వాత అఫ్గనిస్థాన్‌ను మళ్లీ స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. కఠిన ఆంక్షలతో అక్కడ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. తాలిబన్ల ఏలుబడిలో ముఖ్యంగా అఫ్గన్ మహిళల పరిస్థితి దుర్బరంగా మారింది. వారిని చదువు, ఉద్యోగాలకు దూరం చేస్తూ విద్యాసంస్థల మూసివేత మొదలు.. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడంపైనా నిషేధం విధించారు. తాజాగా, మహిళల విడాకులకు సంబంధించి తాలిబన్లు తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విడాకులను రద్దుచేసిన తాలిబన్లు.. గృహహింసకు గురై భర్తలకు దూరంగా ఉంటున్న మహిళలను, తిరిగి వారి మాజీలతోనే కలిసుండాలని ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.

అమెరికా బలగాల నీడలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న అఫ్గన్ మహిళలకు తాలిబన్లు వచ్చిన తర్వాత అవన్నీ కాలగర్బంలో కలిసిపోయాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారిపైనా తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టపరంగా గతంలో విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తతో కలిసి జీవించాలని తాలిబాన్‌ కమాండర్లు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడటం, చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ వారి నుంచి దూరంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి సవాళ్లను అఫ్గన్‌ మహిళలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన చెందింది.

విడాకులు తీసుకున్న మహిళలను వారి మాజీ భర్తలతోనే కలిసి ఉండేలని ఒత్తిడి తెస్తున్నారనే నివేదికలపై తాలిబాన్‌ ప్రతినిధులు స్పందించారు. అటువంటి ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేపట్టి, అనంతరం షరియా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తాలిబాన్‌ అధికార ప్రతినిధి ఇనాయతుల్లా మీడియాకు వెల్లడించారు. గతంలో తీసుకున్న విడాకులను ఆమోదిస్తారా అన్న ప్రశ్నకు.. ఇది ముఖ్యమైన, సంక్లిష్టమైన సమస్య అని సమాధానం దాటవేయడం గమనార్హం.

ఓ అఫ్గన్ మహిళ ఏఎఫ్‌పీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ‘తాలిబన్లు రెండోసారి అధికారం చేపట్టిన రోజున దేవుడా ఆ రాక్షసులు మళ్లీ వచ్చారని నేను, నా కుమార్తెలు ఎంతగానో ఏడ్చామని కన్నీటిపర్యంతమయ్యారు. చేతులు విరిగి, వేళ్లు పగులగొట్టి, ఇంట్లోకి లాక్కెళ్లి కొట్టిన దెబ్బలను నెలల తరబడి భరించాను.. నేను అపస్మారక స్థితిలో ఉన్న రోజులు ఉన్నాయి.. నా కుమార్తెలు నాకు ఆహారం పెట్టేవారు.. భర్త నా జుట్టు పట్టుకుని చాలా గట్టిగా ఈడ్చుకెళ్లడంతో పాక్షికంగా బట్టతల ఏర్పడింది.. క్రూరంగా హింసించాడు.. దవడలు వాయించడంతో నా దంతాలు విరిగిపోయాయి’అని భర్త పెట్టిన చిత్రహింసలను గుర్తుచేసుకుంది.

బలాన్ని కూడగట్టుకుని తన ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులతో వందల కిలోమీటర్ల దూరంలోని తన బంధువుల ఇంటికి పారిపోయామని వాపోయింది. ‘అమ్మా, మనం ఆకలితో అలమటించినా ఫర్వాలేదు. కనీసం ఆ వేధింపులనైనా వదిలించుకున్నాం’అని నా పిల్లలు అంటారు.. కానీ, ఇప్పుడు తాలిబన్లు తీసుకున్న నిర్ణయం మా జీవితాలను మళ్లీ అంధకారంలోకి నెట్టేస్తోందని వాపోయారు. అఫ్గన్‌లోని ప్రతి 10 మంది మహిళల్లో 9 మంది తమ జీవిత భాగస్వామితో శారీరక, లైంగిక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు ఐరాస వెల్లడించింది.

Read More Latest International News And Telugu News

Related Articles

Back to top button