Suryakumar Yadav,IND vs WI: సూర్యకుమార్, తిలక్ వర్మ షో.. గెలిచి నిలిచిన భారత్ – suryakumar yadav and tilak varma lead india win against west indies in third t20
తొలి రెండు మ్యాచుల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచులో విశ్వరూపం చూపించాడు. 44 బంతుల్లోనే 4 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో వంద సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి సత్తా చాటాడు. 37 బంతుల్లో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచు ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అడుగు పెట్టిన యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (11 బంతుల్లో 6) మరోసారి నిరాశపరిచాడు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ చెలరేగిపోవడంతో భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పోవెల్ 19 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, అక్షర్ 1, ముకేశ్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచు ఫలితంతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచుల్లో వెస్టిండీస్ గెలవగా.. మూడో మ్యాచులో భారత్ గెలిచింది. ప్రస్తుతం 2-1 వెస్టిండీస్ ఈ సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. సిరీస్ దక్కించుకోవాలంటే భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలవాల్సిందే. సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 ఆగస్టు 12వ తేదీన జరగనుంది.