News

Supreme Court,Parliamentary Panel: వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి.. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా పార్లమెంటరీ ప్యానెల్ రిపోర్ట్ – make adultery crime again parliamentary panel contradicts supreme court order


Parliamentary Panel: గతంలో వ్యభిచారం నేరం కాదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా పార్లమెంటరీ ప్యానెల్ తాజాగా కేంద్రానికి నివేదిక ఇవ్వడం సంచలనంగా మారింది. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకురానున్న కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేసిన పార్లమెంటరీ ప్యానెల్ కీలక సవరణలు చేసింది. ఇందులో భాగంగానే వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలంటూ సూచించింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలను కూడా చేసింది.

గతంలో సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497 (వ్యభిచారం)ను మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత బిల్లుపై సమీక్ష నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైందని.. దాన్ని పరిరక్షించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భారతీయ న్యాయ సంహిత బిల్లులపై రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్ఫించింది. ఆ రిపోర్టులో సవరణలు సూచిస్తూ ఈ వ్యభిచారాన్ని లింగ తటస్థ నేరంగా పరిగణించాలని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో స్త్రీ, పురుషులు సమాన బాధ్యత వహించాలని ఎంపీల ప్యానెల్ తేల్చి చెప్పింది.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఈ కొత్త బిల్లులకు ఆమోదం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లులను ఇప్పటికే స్టాండింగ్ కమిటీలకు పంపించగా.. వాటి నివేదికలు కూడా కేంద్రం వద్దకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ ప్యానెల్ సూచించిన విధంగా ఆ బిల్లులో మార్పులు చేర్పులకు ఒక వేళ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపితే.. సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలపై 2018 లో ఇచ్చిన సంచలన తీర్పును పక్కకు పెట్టినట్లవుతుంది.

వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్‌ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్‌ 497 కు కాలం చెల్లిందని పేర్కొంటూ దాన్ని కొట్టివేసింది. అయితే ఈ తీర్పు వెలువరించక ముందు.. ఒక పురుషుడు ఒక మహిళతో ఆమె భర్తకు తెలియకుండా లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు కోర్టులో రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష పడేది. అయితే ఈ కేసులో స్త్రీకి ఎలాంటి శిక్ష విధించేవారు కాదు. అయితే తాజాగా కొత్త బిల్లుకు సవరణలను ప్రతిపాదించిన పార్లమెంటరీ ప్యానెల్.. వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూనే.. ఇందులో స్త్రీ, పురుషులు ఇద్దరినీ బాధ్యత వహించేలా చూడాలని పేర్కొంది.

Amit Shah: పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు.. ఐపీసీ, సీఆర్‌పీసీల స్థానంలో కొత్త కేంద్రం బిల్లులు

Parliament Winter session: డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులకు మోక్షం లభించేనా?

Read More Latest National News And Telugu News

Advertisement

Related Articles

Back to top button