News

Sri Lanka Groundsmen,జాక్ పాట్ కొట్టిన శ్రీలంక గ్రౌండ్స్‌మెన్‌.. భారీ నజరానా ప్రకటించిన జై షా – acc president jay shah announces 50000 dollars cash reward for groundsmen and curators of colombo and kandy


పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్.. బీసీసీఐ పంతంతో పాక్‌తోపాటు శ్రీలంకలో నిర్వహించిన సంగతి తెలిసిందే. పాక్‌లో టీమిండియా పర్యటనకు బీసీసీఐ ససేమిరా అంగీకరించకపోవడంతో.. శ్రీలంకతో కలిసి ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాక్ ఒప్పుకోక తప్పలేదు. పాకిస్థాన్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా.. ఫైనల్ సహా ఎక్కువ మ్యాచ్‌లకు లంకే ఆతిథ్యం ఇచ్చింది. అయితే వరణుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

భారత్, పాక్ మధ్య తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మిగతా మ్యాచ్‌లపైనా వరుణుడి ప్రభావం పడింది. అయితే శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్ ఎంతో కష్టపడి వేదికలను సిద్ధం చేశారు. వర్షం మొదలు కాగానే పిచ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచడంతోపాటు.. చిత్తడిగా మారిన మైదానాన్ని ఆరబెట్టేందుకు ఎంతో శ్రమించారు. భారత్, పాక్ మధ్య సూపర్ 4 మ్యాచ్ గ్రౌండ్ సిబ్బంది శ్రమ వల్లే జరిగిందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్ సైతం తన ప్రైజ్ మనీని వారికి గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు ప్రకటించాడు.

ఎంతో శ్రమించి ఆసియా కప్ నిర్వహణ సాధ్యమయ్యేలా చేసిన గ్రౌండ్స్‌మెన్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. కొలంబో, క్యాండీల్లో భారీ వర్షాలు కురిసినా.. మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యమయ్యేలా చేశారంటూ.. గ్రౌండ్స్‌మెన్, క్యురేటర్లను ప్రశంసించిన ఏసీసీ అధ్యక్షుడు జై షా.. ఏసీసీ, శ్రీలంక క్రికెట్ తరఫున వారికి 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

గ్రౌండ్స్‌మెన్, క్యురేటర్ల పట్టుదల, కష్టం వల్లే వల్లే ఆసియా కప్ అద్భుతంగా జరిగిందన్న షా.. క్రికెట్ మ్యాచ్‌లు జరిగేందుకు వారు ఎంతగానో సహకరించారన్నారు. అందుకే వారి సేవలకు గుర్తింపుగా 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు జై షా తెలిపారు.

వర్షం కారణంగా భారత్, పాక్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌ను రిజర్వ్ డేన నిర్వహంచాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం శ్రీలంక క్రికెట్ నేషనల్ క్యురేటర్ గాడ్‌ఫ్రే డబరే.. 60 మంది గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి శ్రమించారు. భారీ వర్షాలు కురవొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆసియా కప్ కోసం మరో 50 మంది కూలీలను నియమించుకున్నారు.

అసలు మ్యాచ్‌లు ప్రారంభానికి ముందే.. వర్షం పడితే కవర్స్ ఎలా కప్పాలనే విషయమై గ్రౌండ్స్‌మెన్, కొత్తగా నియమించుకున్న వారికి డబరే శిక్షణ ఇచ్చారు. చేతిలో స్టాఫ్ వాచ్ ఉంచుకొని మరీ ఎంత టైంలోగా వారు కవర్లను కప్పగలుగుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. అవసరమైతే పల్లకెలె, గాలె, హంబన్‌టోట నుంచి మరింత మంది గ్రౌండ్ స్టాఫ్‌ను తీసుకురావాలని అనుకున్నామని ఆయన తెలిపారు.

Related Articles

Back to top button