News

somireddy chandra mohan reddy, సీఎం జగన్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఒక్క పార్టీ అయినా ముందుకొస్తుందా: సోమిరెడ్డి – tdp leader somireddy chandra mohan reddy criticise to cm ys jagan mohan reddy


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తమ మాదిరిగా తెలుగు దేశం, జనసేన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అని సీఎం జగన్ ప్రశ్నించారు.

సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. 175 సీట్లలో పోటీపై దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డితో ఒక్క స్థానంలో అయినా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక ఆర్థిక నేరస్తుడు, అరాచక వాది, నియంత అయిన సీఎం జగన్మోహన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని నిలదీశారు. పరిపాలన అధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రజల కోసమే పని చేసే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటుందన్నారు.

1983 నుంచి పలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశామని.. మరికొన్ని ఎన్నికల్లో కలిసొచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ, యూపీఏ, నేషనల్ ఫ్రంట్ వంటి అనేక కూటములు ఈ దేశాన్ని పాలించాయన్నారు. కొన్నింటిలో తాము కూడా భాగస్వాములమయ్యామని పేర్కొన్నారు. ప్రజలతో అధికారం పంచుకోవడం కోసమే పొత్తుల రూపంలో కొన్ని పార్టీలు కలిసివస్తున్నాయని తెలిపారు. నియంత కాబట్టే జగన్మోహన్ రెడ్డితో ఎవరూ కలిసివచ్చే ఆలోచన చేయడం లేదన్నారు. దాన్ని గొప్పగా అభివర్ణించుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Related Articles

Back to top button