Soldier Kidnapped And Killed,Manipur: సెలవుల్లో ఇంటికి వెళ్లిన మణిపూర్ జవాన్.. కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు – soldier on leave kidnapped from his manipur home then killed
మణిపూర్ పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సెర్టో తంగ్‌తంగ్ కోమ్ అనే వ్యక్తి భారత సైన్యంలో సిపాయిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల సెలవుల్లో భాగంగా స్వస్థలాలనికి వచ్చాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 10 గంటలకు దుండగులు అతడ్ని కిడ్నాప్ చేశారు. తన ఇంట్లోని వరండాలో పనిచేస్తున్న సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ను ముగ్గురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్లు అతని పదేళ్ల కుమారుడు వెల్లడించాడు. ఈ కేసులో ఆ బాలుడే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు దుండగులు తెలుపు రంగు కారులో వచ్చి తమ చేతుల్లో ఉన్న తుపాకులను తన తండ్రి తలపై పెట్టి బెదిరించినట్లు ఆ పదేళ్ల బాలుడు పోలీసులకు వివరించాడు. అనంతరం సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు చెప్పాడు.
ఈ నేపథ్యంలోనే సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని జాడ కోసం వెతికారు. ఈ క్రమంలోనే తూర్పు ఇంఫాల్ జిల్లాలోని మోంగ్జామ్ ప్రాంతానికి తూర్పున ఉన్న ఖునింగ్‌థెక్ గ్రామంలో సెర్టో తంగ్‌తంగ్ కోమ్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే ఆ మృతదేహాన్ని సెర్టో తంగ్‌తంగ్ కోమ్ సోదరుడు, బావ గుర్తించారు. సెర్టో తంగ్‌తంగ్ కోమ్ తలలో ఒకే ఒక బుల్లెట్ గాయం ఉన్నట్లు తెలిపారు. సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కిడ్నాప్, హత్యపై భారత సైన్యం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్లిష్ట సమయాల్లో సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది. సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు అతని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ఒక ఆర్మీ టీంను మణిపూర్‌లోని అతని స్వగ్రామానికి పంపించినట్లు సైన్యం పేర్కొంది.
Read More Latest National News And Telugu News