sinking, New York: మునిగిపోతున్న న్యూయార్క్ నగరం.. తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలు – new york sinking under the weight of its buildings new study warns
యూనివర్సిటీ అధ్యయనం
యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్‌లోని యూఎస్ జియోలాజికల్ సర్వే అండ్ జియోలాజిస్ట్స్ విభాగం ఈ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ఎర్త్స్ ఫ్యూచర్ (Earth’s Future ) అనే జర్నల్‌లో ప్రచురితమైంది. న్యూయార్క్ నగరం యొక్క భూగర్భ శాస్త్రం, శాటిలైట్ సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రమాదంలో మరిన్ని నగరాలు
మ్యాన్‌హట్టన్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు చాలా వేగంగా కుంగుబాటుకు గురవుతున్నాయని అధ్యయనం తెలిపింది. దీంతోపాటు బ్రూక్లిన్, క్వీన్స్ కౌంటీల పరిస్థితిపైనా అధ్యయన కర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్ నగరానికి వరదలు వచ్చే ప్రమాదాలు గణనీయంగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది. ప్రపంచంలో మిగితా నగరాల సగటు కంటే ఉత్తర అమెరికాలోని అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న న్యూయార్క్ నగరానికి సముద్ర మట్టం పెరుగుదల ముప్పు 3 నుంచి 4 రెట్లు అధికంగా ఉందని పేర్కొంది. 84 లక్షల మంది జనాభా ఉన్న న్యూయార్క్ నగరవాసులకు ప్రమాదం పొంచి ఉందని ప్రధాన పరిశోధకుడు టామ్ పార్సన్స్ తెలిపారు. పెరుగుతున్న వరద ప్రమాదం, సముద్ర మట్టాల పెరుగుదలను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అందుకోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెప్పారు. సముద్రాలు, నదీ తీర ప్రాంతాల్లో నిర్మించిన ప్రతీ కొత్త భవనం భవిష్యత్తులో వరద ముప్పునకు కారణమవుతుందని హెచ్చరించారు.
పకడ్బందీగా అధ్యయనం
ఈ అధ్యయనాన్ని చేసేందుకు న్యూయార్క్ నగరాన్ని మొదట గ్రిడ్లుగా విభజించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ విస్తీర్ణంలో ఉన్న భవంతుల గురుత్వాకర్షణ బలం ఆధారంగా భూమిపై పడే ఒత్తిడిని లెక్కించినట్లు చెప్పారు. ఈ అధ్యయనంలో రోడ్లు, కాలిబాటలు, వంతెనలు, రైల్వేలతోపాటు ఖాళీ ప్రాంతాలను లెక్కలోకి తీసుకోలేదని వివరించారు. కేవలం భవనాలను మాత్రమే లెక్కలోకి తీసుకుని అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. పెరిగిన నగరీకరణ, భూగర్భ జలాలను విరివిగా వాడటం, డ్రైనేజీ వ్యవస్థ.. న్యూయార్క్ నగరాన్ని మరింత కుంగదీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.