sarath babu family background, శరత్ బాబుకి ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు.. ఆమదాలవలస ‘సుశీల సదన్’ కథ ఇదీ! – actor sarath babu has seven brothers and five sisters
మరోవైపు, శరత్ బాబు మృతిని ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. శరత్ బాబు చాలా మంచి వ్యక్తి అని, ఆమదాలవలస వస్తే అందరితో సరదాగా ఉండేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకుంటున్నారు. అయితే, శరత్ బాబు సొంతిల్లు ‘సుశీల సదన్’ను చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అంత గొప్ప నటుడి ఇల్లు ఈ విధంగా ఎందుకు అయిపోయిందనిపిస్తుంది.
ఆమదాలవలసలో శరత్ బాబు ఇల్లు
71 సంవత్సరాల శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. సత్యంబాబు దీక్షితులు అని కూడా అంటారు. శతర్ బాబు తల్లిదండ్రులు విజయ్ శంకర్ దీక్షిత్, సుశీల ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి ఆమదాలవలసకు వలస వచ్చారు. అక్కడ మొదట్లో రైల్వే క్యాంటీన్ నడిపేవారు. ఆ తరవాత ఆమదాలవలసలో హోటల్ పెట్టారు. 1951 జులై 31న ఆమదాలవలసలోనే శరత్ బాబు జన్మించారు. శరత్ బాబుది చాలా పెద్ద కుటుంబం. ఆయనకు ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. శరత్ బాబు తన తల్లి సుశీల పేరు మీద ‘సుశీల సదన్’ అని ఆమదాలవలసలో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది. కాకపోతే బాగా పాతబడింది. చెన్నైలో కూడా శరత్ బాబు ‘సుశీల సదన్’ పేరుతోనే ఇల్లు కట్టుకున్నారని ఆయన మిత్రులు చెప్పారు.
ఇక ఆమదాలవలసలో ఉన్న ఇంట్లో శరత్ బాబు అన్నదమ్ములు కుటుంబాలు ఉంటున్నాయి. అయితే, వారంతా శరత్ బాబు అంత్యక్రియల నిమిత్తం చెన్నై బయలుదేరి వెళ్లారు. కాకపోతే ఆయన రెండో వదిన, చిన్న తమ్ముడు ఆమదాలవలసలోనే ఉండిపోయారు. చిన్న తమ్ముడు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయనతో పాటు చిన్న వదిన కూడా ఉండిపోయారు. శరత్ బాబు మృతిపై ఆమె స్పందిస్తూ.. తమ కుటుంబానికి తీరని లోటని అన్నారు. తనను వదినలా కాకుండా తల్లిలా చూసుకునేవారని చెప్పారు. తన కన్నవారిది సామర్లకోట అని.. ఆమదాలవలస నుంచి మద్రాసు వెళ్లేటప్పుడు శరత్ బాబు సామర్లకోటలో దిగి తమ కుటుంబంతో ఎంతో సరదాగా గడిపేవారని ఆమె వెల్లడించారు.
శరత్ బాబు చిన్న తమ్ముడు
శరత్ బాబు చివరిసారిగా మూడేళ్ల క్రితం ఆమదాలవలస వచ్చారని ఆవిడ చెప్పారు. గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి శరత్ బాబు వచ్చారన్నారు. శరత్ బాబు బీఎస్సీ చదువుకున్నారని.. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవారని తెలిపారు. ఎనిమిది మంది అన్నదమ్ములు అయినప్పటికీ ఎంతో కలిసి మెలిసి ఉంటారని.. అన్నదమ్ముల భార్యలను, పిల్లలను కూడా శరత్ బాబు ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని చెప్పారు.