Richie Gadi Pelli Movie Review: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న రిచిగాడి పెళ్లి
పెద్ద సినిమాలు ఈ వారం గ్యాప్ ఇవ్వడంతో చాలా చిన్న సినిమాలు వచ్చాయి. అందులో రిచిగాడి పెళ్లి కూడా ఒకటి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మూవీ రివ్యూ: రిచిగాడి పెళ్లి
నటీనటులు: సత్య ఎస్.కె, నవీన్ నేని, బన్నీ వాక్స్, ప్రణీత పట్నాయక్, కిషోర్ మారిశెట్టి, సతీష్ శెట్టి, చందన రాజ్ తదితరులు..
సంగీతం: సత్యన్
సినిమాటోగ్రాఫర్: విజయ్ ఉలగనాథ్
ఎడిటింగ్: అరుణ్ EM
నిర్మాత: కేఎస్ ఫిలిమ్స్
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: KS హేమ్రాజ్
పెద్ద సినిమాలు ఈ వారం గ్యాప్ ఇవ్వడంతో చాలా చిన్న సినిమాలు వచ్చాయి. అందులో రిచిగాడి పెళ్లి కూడా ఒకటి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
రిచి (సత్య) పెళ్లి ఊటీలో సిరి (చందన రాజ్) తో ఘనంగా చేసుకోవాలని అనుకుంటాడు. ఈ నేపథంలోనే తన స్నేహితులందరినీ పెళ్లికి ఆహ్వానిస్తాడు రిచి. దీని పక్కలోనే ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతారు. అందులో నవీన్ (నవీన్ నేని) సీరియల్ హీరో. బన్నీ వాక్స్ సహా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. అందరూ కలిసి ఫ్రెండ్ పెళ్లికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే అక్కడ పార్టీలో కూర్చున్న తర్వాత ఫోన్స్ స్పీకర్ లోనే మాట్లాడాలి అనే రూల్ పెట్టుకుంటారు. అప్పుడే అందరికీ సమస్యలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ.
కథనం:
ఈరోజుల్లో చిన్న సినిమాల్లోని డిఫరెంట్ కాన్సెప్ట్స్ బయటికి వస్తున్నాయి. రిచి గాడి పెళ్లి సినిమా విషయంలో కూడా దర్శకుడు హేమ్రాజ్ చేశాడు. ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకున్నాడు దర్శకుడు. సినిమా మొదటి అరగంట క్యారెక్టర్స్ పరిచయం కోసం కాస్త నెమ్మదిగా వెళుతుంది.. కానీ ఆ తర్వాత మాత్రం ఆసక్తికరమైన కథనంతో ముందుకు నడిపాడు. మరీ ముఖ్యంగా ఏ ఫోన్ వచ్చినా కూడా అందరి ముందు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడాలి అనే కాన్సెప్టే చాలా దారుణంగా ఉంటుంది. పైగా సినిమా అంతా ఒక రిసార్ట్ లోనే సాగుతుంది.
అక్కడ ఫోన్ గేమ్ తో కథ ముందుకు నడుస్తుంది. దాని వల్ల అక్కడ ఉన్న వాళ్లకు లేని సమస్యలు రావడం.. అప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి.. ఇలాంటివన్నీ ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు హేమ్రాజ్. ముఖ్యంగా నవీన్ నేని, బన్నీ బాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడితే ఎన్ని సమస్యలు వస్తాయి అనేది ఈ సినిమా కథ చూస్తే అర్థమవుతుంది. మనం ఎంత ఓపెన్ గా ఉండాలని చూసినా.. కొన్ని విషయాలు మనకంటూ కావాల్సిన వాళ్ళ దగ్గర దాచి పెడుతూ ఉంటాము. అలాంటి పాయింట్లు ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. వచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరించుకుంటారు అనేది చక్కగా చూపించాడు. కాకపోతే ఇది థియేటర్ కంటే ఓటీటీలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న సినిమా కావడం కొత్తవాళ్లు ఉండడంతో ప్రమోషన్ గట్టిగా చేసుకోవాలి.. లేదంటే కంటెంట్ బాగానే ఉన్నా వెనకే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.
నటీనటులు:
ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే ఉన్నారు. టైటిల్ రోల్ లో సత్య చాలా బాగా నటించాడు. మరో కీలకమైన పాత్రలో నవీన్ నేని బాగున్నాడు. యూ ట్యూబర్ బన్నీ వాక్స్ కూడా తన పాత్రకి న్యాయం చేశారు. ఈ సినిమాలో సతీష్ శెట్టి కామెడీ చాలా బాగుంది. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు..
టెక్నికల్ టీం:
సత్యన్ సంగీతం పర్లేదు. కైలాష్ ఖేర్ పాడిన మొదటి పాట బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండాఫ్ ఇంకాస్త వేగంగా ఉండాల్సింది. ఊటీ అందాలన్నీ సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉలగనాథ్ బాగా చూపించాడు. దర్శకుడు హేమరాజ్ తీసుకున్న లైన్ బాగుంది.. కానీ ఇంకాస్త ట్విస్టులతో కథ చెప్పుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు.
పంచ్ లైన్:
రిచి గాడి పెళ్లి.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..