News

Rekha Nayak,నాకు చేసింది చాలదన్నట్టు నా బిడ్డకూ అన్యాయం చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే – khanapur brs mla rekha nayak emotiional comments on cm kcr


బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్యే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవటంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రేఖా నాయక్.. పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలతో భేటీ కూడా అయ్యారు. ఇప్పటికే.. రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూడా. అయితే.. ఆమె కూడా కాంగ్రెస్‌లో చేరటం ఖాయమనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. దస్తూరాబాద్‌లో పర్యటించిన రేఖా నాయక్.. సీఎం కేసీఆర్ తనను పక్కన పెట్టినా.. తను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తెలిపారు. 12 ఏళ్లుగా పార్టీ కోసమే పని చేశానని చెప్పుకొచ్చారు.

అయితే.. నేడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నానన్న రేఖనాయక్.. ఏసీడీపీ నిధులు ఆపారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు కూడా ఆపారని.. నిధులు రాకుండా నిలిపి వేశారని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం తాను నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారన్నారు. పార్టీ మారింది తన భర్త మాత్రమేనని.. తాను కాదంటూ స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్‌తో ఉంటే.. ఆయన తండ్రి మాత్రం సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ప్రశ్నించారు. తనకు చేసిన అన్యాయం చాలదన్నట్లు తన బిడ్డకు కూడా అన్యాయం చేశారంటూ కార్యకర్తల దగ్గర భోరున విలపించారు. కావాలనే తన అల్లున్ని(ఐపీఎస్) బదిలీ చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రేఖా నాయక్.

తాను తెలంగాణ ఉద్యమంలో పని చేశానని.. నియోజకవర్గం కోసం పని చేశానంటూ చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నానని చెప్పుకొచ్చారు. అభ్యర్థి కోసం అభివృద్ధి ఆపడం సరికాదన్నారు. ఇలాంటి ధోరణి ఉంటే ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలని ఎమ్మెల్యే రేఖా నాయక్ హెచ్చరించారు.

కోట్ల ఆస్తి వదిలేసి అజ్ఞాతంలోకి.. ఆధారాలన్ని చెరిపేసి వివాహిత కొత్త జీవితం.. ఐదేళ్ల తర్వాత ట్విస్ట్..!

Related Articles

Back to top button