Rangareddy Honor Killing,కూతురు వరసయ్యే అమ్మాయితో ప్రేమ.. పక్కా ప్లాన్‌తో యువకుడిని హత్య చేసిన తండ్రి – honor killing, father killed a young man who loved his daughter in rangareddy district
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన కరణ్ కుమార్ (18) నిర్దవెళ్లిలో ఓ కోళ్ల ఫారంలో కూలీపనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్ కుమార్ కుటుంబం సహా నిర్దవెల్లికి వచ్చి కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. కరణ్‌కుమార్, రంజిత్‌కుమార్ వరుసకు సోదరులు అవుతారు. అయితే వావివరసలు మరిచి కరణ్ రంజిత్ కూతుర్ని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న రంజిత్.. కరణ్‌ను హెచ్చరించాడు. తన కూతురు నీకూ కూతురే అవుతుందని పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. అయినా వినిపించుకోని కరణ్.. అమ్మాయితో సన్నిహిత్యంగా ఉండేవాడు. దీంతో చంపేస్తానని రంజిత్ గట్టిగా బెదిరించాడు. భయపడిపోయిన కరణ్ సిద్ధిపేటకు వెళ్లి అక్కడ పనిలో కుదిరాడు.
అక్కడికెళ్లినా కరణ్‌లో మార్పు రాలేదు. ఆమెతో తనకు పెళ్లి జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. అది చూసి తట్టుకోలేని రంజిత్ కరణ్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బిహార్‌కు చెందిన ముంతోష్ కుమార్, బబ్లూ, మరో ఇద్దరు మైనర్ల సాయం తీసుకున్నాడు. ఆగస్టు 15న కరణ్‌కు ఫోన్ చేసిన కరణ్.. పని ఉందని చెప్పి నిర్దవెల్లి-జూలపల్లి మధ్య రహదారి పక్కకు పిలిపించాడు. అక్కడే పొలంలోని బురద నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి పాతిపెట్టాడు. ఆ తర్వాత తన తమ్ముడు కనిపించడం లేదంటూ కరణ్ అన్న దీపక్ ఆగస్టు 29న కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. చివరిసారిగా రంజిత్ కాల్ చేయడం, కరణ్ ఫోన్ సిగ్నల్ నిర్దవెల్లి మధ్య ఉన్నట్లు సాంకేతికంగా గుర్తించారు. ఈలోపే నిందితులు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పరారయ్యారు. ఫోన్లు స్విచాఫ్ చేయడంతో నిందితులను కనుక్కోవడం కష్టమైంది. ఈ సమయంలోనే నిందితుల్లో ఒకరు యువతికి కాల్ చేసి స్విచాఫ్ చేశారు. అమ్మాయి ఫోన్ ట్రేస్ చేసిన పోలీసులు.. నిందితులు ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో తలదాచుకున్నట్లు గుర్తించారు. అక్కడికెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు.