News

Raghu Rama Krishnam Raju, మా పార్టీ అయినా సరే, ఆయన నిజం చెప్పారు.. మరోసారి పొగిడేసిన ఎంపీ రఘురామ – raghu rama krishnam raju comments on vizag rushikonda and education in ap


విశాఖ రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ అక్కడ యదేచ్చగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. రుషికొండపై పర్యాటక భవనాలను నిర్మిస్తున్నామని చెప్పి.. ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాస సముదాయానికి సరిపడా భవనాలను నిర్మిస్తున్నారని అన్నారు. 12 ఏళ్ల క్రితం రుషికొండపై నిర్మించిన కాటేజీల స్థానంలో కొత్త కాటేజీలను నిర్మిస్తామని అనుమతులు పొంది.. ఇప్పుడు భారీ భవంతులను నిర్మిస్తున్నారని తెలిపారు. రుషికొండ ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక అందజేయలేదన్నారు.

పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పల్లెల్లో నిద్రించకుండా విశాఖపట్నానికి వచ్చి పడుకుంటారట అని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారని చెబుతున్న తమ పార్టీ నేతలు, సోమ మంగళవారాలలో మాత్రమే ఆయన స్థానికంగా అందుబాటులో ఉంటారని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాలకు పోటీ చేసే దమ్ము తనకు ఉందని, ప్రతిపక్షాలకు ఆ దమ్ము ఉందా అని జగన్ ప్రశ్నించడంపై నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు.

8 లక్షల పైచిలుకు రైతుల అకౌంట్లోకి కోట్లాది రూపాయలు జమ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ తమ పార్టీ నేత చేసిన ట్వీట్ వైరల్ గా మారిందన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అబద్ధం చెబితే.. పార్టీ నేత మాత్రం నిజం చెప్పారని వ్యాఖ్యానించారన్నారు. కేంద్రం పథకాల పేర్లను మార్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రధాని మోదీకి తాను ఒక లేఖ రాసినట్లుగా రఘురామకృష్ణ రాజు చెప్పారు. ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి అన్నారు.

ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% సీట్లను కేటాయించాలన్నారు రఘురామ. ప్రైవేటు స్కూల్లో చేర్చిన వారికి ఫీజులో రాయితీ ఇవ్వబడుతుందని.. రైట్ టు ఎడ్యుకేషన్ కు ప్రత్యామ్నాయంగా గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ను తీసుకువచ్చారని గుర్తు చేశారు. అయితే వాటిని ఇప్పుడు ఎత్తివేశారని.. జగన్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని సందర్శించి రాష్ట్రంలోని పాఠశాలలో అటువంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలిగితే ప్రభుత్వం ఉచిత పథకాలు అందించాల్సిన అవసరం ఉండదన్నారు రఘురామ. చదువును ఇవ్వగలిగితే మీరిచ్చే ఉచిత పథకాల అవసరం ఉండదన్నారు. మెరుగైన మౌలిక వసతులను కల్పించి విద్యను అందిస్తే వారి కాళ్లపై వారే నిలబడతారని, అంతేకానీ పేదలు పేదలు గానే ఉంటే అధికారం తమ చేతుల్లో ఉంటుందనే ఆలోచన విధానాన్ని విడనాడాలన్నారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button