News

Punganur Attacks,Chandrababu: నా హత్యకు ప్లాన్ చేశారు.. సీబీఐతో విచారణ చేయాలి: చంద్రబాబు – tdp chief chandrababu responded to punganur attack incidents


Chandrababu: పుంగనూరు దాడుల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. తన హత్యకు ప్లాన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని, తనను చంపడానికి ఎవరు ప్లాన్ చేస్తున్నారో విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు. తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని, ఇదెక్కడి దుర్మార్గమో తనకు అర్ధం కావడం లేదన్నారు. సైకో సీఎం ఆదేశాల ప్రకారమే తనను తిరగనీయకుండా చేద్దామనుకున్నారని ఆరోపించారు. ప్రజల తరపున పోరాడుతుంటే తనపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు.

పుంగనూరు దాడి వ్యవహారంపై మాట్లాడేందుకు విజయనగరంలో చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనపై జరిగిన రాళ్ల దాడి, టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాల వీడియోలను స్క్రీన్‌పై చూపించారు. అనంతరం మాట్లాడుతూ.. అంగళ్లుకు తాను వెళ్లేముందు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున గుమిగూడారని, తనపైనే దాడికి కుట్ర పన్నితే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారాని ఆరోపించారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అంటూ ప్రశ్నించారు. తనపై ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా దాడి జరిగిందని, చాలాసార్లు దాడికి ప్రయత్నించారని అన్నారు.

రాష్ట్రంలో అందరిపైనా కేసులు పెట్టారని, మీడియాకు, రాజకీయ నాయకులకు రక్షణ లేదని చంద్రబాబు ఆరోపించారు. చిరంజీవి చిన్న మాట అంటే ఎదురుదాడి చేస్తున్నారని, అధికారమనే పిచ్చిరాయి చేతిలో పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇంత ఘోరంగా వ్యవహరించి తనపైనే కేసు పెట్టారని, పోలీస్ అధికారులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. తనపైనే హత్యాయత్నం చేసి హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాస్తానని తెలిపారు. దోషులను ప్రజాక్షేత్రంలో నిలబెట్టే వరకు వదిలిపెట్టనని చెప్పారు.

న్యాయపరంగా పోరాడుతూనే వైసీపీ తప్పిదాలను ఎండగడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. మమ్మల్ని అందరినీ చంపేసి మీరు రాజకీయం చేద్దామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తాను పుంగనూరుకు వెళ్లలేదని, నేరుగా హంద్రీనివా వెళుతున్నానని చెప్పానన్నారు. ప్రతిపక్ష నేతలను అంతం చేసి రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాగా అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో పలువురు టీడీపీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్‌నాథ్, ఏ4గా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో పాటు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Related Articles

Back to top button