News

pune h3n2 deaths, H3N2 Virus: దేశంలో క్రమంగా పెరుగుతున్న మరణాలు.. పుణేలో ఇద్దరు మృతి – two senior citizens become first influenza h3n2 virus related casualties in pune of maharashtra


తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా వైరస్ తిరిగి అలజడి రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా దేశంలో కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇన్‌ఫ్లూయెంజా ఏ ఉప వర్గం వైరస్ హెచ్3ఎన్2 విజృంభణ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏటా సీజనల్‌గా వచ్చే ఫ్లూ ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల వల్ల ప్రాణాంతకంగా మారింది. తాజాగా, మహారాష్ట్రలో మరో ఇద్దరు వయోవృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి సహా ఇద్దరు హెచ్3ఎన్2 అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

పుణేలోని యశ్వంతరావ్ చవాన్ మెమోరియల్ హాస్పిటల్ డీన్ రాజేంద్ర వబాలే మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 73 ఏళ్ల వయోవృద్ధుడు మార్చి 7న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ‘క్రానిక్ అబస్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డ్‌తో మార్చి 7న ఆస్పత్రిలో చేరారు.. అతడికి గుండె సంబంధిత సమస్య కూడా ఉంది.. అతడి నమూనాలను ఎన్ఐవీకి పంపగా.. హెచ్‌3ఎన్2 ఇన్‌ఫెక్షన్ నిర్దారణ అయ్యింది’ అని డాక్టర్ రాజేంద్ర వెల్లడించారు.

మార్చి 11న హెచ్3ఎన్2 అనుమానిత లక్షణాలతో మరో 67 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్టు పుణే మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సూర్యకాంత్ దేవకర్ తెలిపారు. ‘అతడు 11న ఓ ప్రయివేట్ ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతిచెందితే.. మార్చి 14న మాకు సమాచారం ఇచ్చారు.. దీని గురించి రాష్ట్ర ఆరోగ్య శాఖకు తెలియజేశాం.. బాదితుడికి చక్కెర, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నాయి.. ప్రయివేట్ ఆస్పత్రిలో ల్యాబ్ పరీక్షల్లో హెచ్3ఎన్2 నిర్దారణ అయ్యింది’ అని చెప్పారు. అనారోగ్యానికి గురైన ఆ వ్యక్తి ఫిబ్రవరి 28న ఆస్పత్రిలో చేరాడని తెలిపారు.

నివారణ చర్యల్లో భాగంగా బాధితుడు నివాసం ఉంటోన్న చుట్టుపక్కల 100 ఇళ్లలో ఫ్లూ వంటి లక్షణాలతో రోగులు ఎవరైనా ఉన్నారని ఎస్ఏఆర్ఐ, ఐఎల్ఐ సర్వేయిలెన్స్ చేపట్టామని దేవకర్ పేర్కొన్నారు. ఆస్పత్రిల్లో చేరుతోన్న బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ హెచ్3ఎన్2 వ్యాప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించాలని సూచించారు. మరోవైపు, మార్చిలో తగ్గాల్సిన ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. నెలాఖరు నాటికి తగ్గే సూచనలు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.

Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button