priti adani, Women’s Day: గౌతమ్ అదానీ సక్సెస్ వెనుక ‘ఆమె’.. ఆ మహిళ ఎవరో తెలుసా? – gautam adani wife priti adani driving force behind adani foundation
మనకు బిలియనీర్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీ గురించి తెలుసు. కానీ, ఆయన కుటుంబ సభ్యుల గురించి చాలా తక్కువగానే తెలుసు. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల్లో చాలా మంది మీడియాకు దూరంగా ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌతమ్ అదానీ సక్సెస్ వెనుకున్న మహిళ గురించి ఇప్పుడు మనం ఓసారి తెలుసుకోవడం చాలా అవసరం. గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ (Priti Adani). ఆయనకు ఇద్దరు పిల్లలు కరణ్ అదానీ, జీత్ అదానీ ఉన్నారు. తన భార్య ప్రీతి అదానీ తన జీవితానికి మూల స్తంభంగా చెబుతుంటారు గౌతమ్ అదానీ, తన పురోగతి కోసం ప్రీతి అదానీ ఆమె కెరీర్‌ను సైతం ఫణంగా పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గౌతమ్ అదానీ 60వ పుట్టిన రోజున ట్వీట్ చేశారు ప్రీతి అదానీ. ‘ 36 సంవత్సరాలు గడిచిపోయాయి. నా కెరీర్‌ను పక్కనపెట్టి గౌతమ్ అదానీతో గొత్త ప్రయాణం మొదలు పెట్టాను. ఈ రోజు తిరిగి చూసుకుంటే ఆయనంటే ఎనలేని గౌరవం, గర్వం పెరిగింది.’ అని పేర్కొన్నారు.
ప్రీతి అదానీ ఎవరు?
ప్రీతి అదానీ ముంబాయిలో 1965లో జన్మించారు. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీని వివాహం చేసుకున్న తర్వాత 1996లో ఆమె పేరును అదానీ ఫౌండేషన్ (Adani Foundation) అధినేతగా ప్రతిపాదించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నప్పటికీ ఆమె తన నిత్య జీవితంలో చాలా వరకు ఛారిటీ కార్యక్రమాల్లో గడుపుతుంటారు. గుజరాత్ అక్షరాస్యతను పెంచేందుకు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె నేతృత్వంలోనే 2018-19 సమయంలో అదానీ గ్రూప్ సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నగదు కేటాయింపులు రూ.128 కోట్లకు పెరిగాయి.
అదానీ ఫౌండేషన్‌ను ప్రీతి అదానీ స్థాపించారు. ప్రస్తుతం దేశాలోని 18 రాష్ట్రాల్లో 2,300 గ్రామాల్లో ఈ అదానీ ఫౌండేషన్ పని చేస్తోంది. పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, పోషకాహార లోపం వంటి సమస్యలపై పోరాడేందుకు నాలుగు ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నైపుణ్య శిక్షణ కోసం సాక్ష్యం, పోషకాహార లోపం తగ్గించేందుకు సుపోశణ్, విద్య కోసం ఉత్తాన్, స్వచ్ఛ గ్రహ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
- Read Latest Business News and Telugu News