News

prasar bharati, 25 వసంతాల ప్రసార భారతి.. బీబీసీకి దీనికి ప్రధాన తేడా ఏంటి? గొప్పతనం ఏంటి? – on the occasion of prasar bharati silver jubilee year, former ceo shashi shekhar vempati road map for next 25 years


భారతదేశ స్వయంప్రతిపత్త పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ‘ప్రసార భారతి’ (Prasar Bharati) నేడు రజతోత్సవాన్ని జరుపుకొంటోంది. సరిగ్గా 25 ఏళ్ల కిందట 1997 నవంబర్ 23న భారత్‌లో చట్టబద్ధమైన బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌గా ప్రసార భారతి ప్రారంభమైంది. పార్లమెంట్ ఆమోదం పొంది అప్పటికే ఏడేళ్లు గడిచింది. ఈ ఇరవై ఐదు సంవత్సరాల మైలురాయి కూడా ఒకానొక క్లిష్ట సమయంలో వచ్చింది. సంస్థకు చెందిన ఉద్యోగుల్లో ఎక్కువ మంది.. రాబోయే కొద్ది సంవత్సరాల్లో పదవీ విరమణ చేయనున్నారు. శ్రామికశక్తిలో గణనీయమైన మార్పుతో ప్రసార భారతి ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో నిలిచి ఉంది.

గత 25 వసంతాల ప్రసార భారతి ప్రయాణాన్ని చూస్తే.. తొలి 20 ఏళ్లలో కోల్పోయిన అవకాశాల కథగానే మిగిలిపోయింది. ఐదేళ్ల కిందట పునరుద్ధరణతో ఆలస్యంగానైనా ఓ వెలుగు వెలిగింది.

పూర్వపు ప్రభుత్వ శాఖలకు చెందిన ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌ల నుంచి పుట్టిన సంస్థ అయిన ‘ప్రసార భారతి’ 20 ఏళ్ల వరకూ రావాల్సినంత గుర్తింపును దక్కించుకులేకపోయింది. పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌గా కాలంతో పోటీ పడలేకపోయింది. దీనికి తోడు పలువురు వాటాదారులు చట్టబద్ధత కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. ప్రసార భారతి ఏర్పాటు సమయంలో అప్పటికే ఉన్న AIR మరియు DD సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా డిప్యూటేషన్ కల్పిస్తూ.. కొత్త సంస్థలో వారిని కొనసాగించాలని నిర్ణయించారు. సేవా సంబంధిత విషయాలపై వివాదాలను దశాబ్దాలుగా పరిష్కరించలేని చేదు అనుభవం ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగులను కొనసాగించారు. ప్రసార భారతి వైఫల్యానికి ఈ రెండింటినీ ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీక్షకుల సంఖ్య (Viewership), ఆదాయం విషయంలో ప్రైవేట్ మీడియాతో పోటీలో వెనుకబడటానికి ఇవే ప్రధాన కారణమయ్యాయి. ఇప్పుడు పదవీ విరమణ అంచున ఉన్న ఈ ఉద్యోగులతో శ్రామికశక్తి తగ్గిపోయి, సంస్థ మరొక క్లిష్ట పరిస్థితుల్లో నిలిచింది.

ప్రపంచంలోని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ సంస్థలన్నింటికీ లైసెన్స్ ఫీ ప్రధాన ఆదాయ మార్గంగా ఉంటుంది. కానీ, ప్రసార భారతి ఇందుకు పూర్తి భిన్నం. అంతేకాకుండా, నిర్వహణ ఖర్చుల కోసం అవసరమైన వాణిజ్య ఆదాయాన్ని సంపాదించుకునేందుకు ప్రైవేట్ రంగంతో పోటీ పడకపోవడం కూడా ఒక ప్రతికూలతగా చెప్పవచ్చు. సంస్థపై ఇది అమితమైన భారాన్ని మోపింది. దీనికి తోడు ప్రజా సేవల బాధ్యతల భారం అదనం. సహచర సంస్థలకు భిన్నంగా.. ఎన్నికల వేళ కొన్ని తప్పనిసరి ప్రసారాలు, వందకు పైగా భాషలు, మాండలికాలలో దేశంలోని రిమోట్ ప్రాంతాలకు సేవలందించడం లాంటి ప్రజా సేవా బాధ్యతలను ప్రసార భారతి విభాగాలైన దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో తమ భుజానికెత్తుకున్నాయి.

బీబీసీ (BBC)ని ఉదాహరణగా తీసుకుంటే.. అది కొన్ని ఛానెళ్లు, సేవలను నిర్వహిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ రుసుముల రూపంలో వేల కోట్లను తీసుకుంటుంది. ఇది డీడీ లేదా ఏఐఆర్ (AIR)తో పోలిస్తే వంద రెట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. గ్లోబల్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్లు బీబీసీ, ప్రసార భారతి మధ్య ప్రధానమైన తేడా ఇదే. FreeDish DTH వాణిజ్యపరమైన విజయంతో డీడీ ఉచిత ఎయిర్ ప్లాట్‌ఫామ్ 45 మిలియన్లకు పైగా గృహాలకు చేరుకుంది. ఇది నిర్వహణా భారాన్ని గణనీయంగా తగ్గించింది. అయితే, సంస్థలోని సుమారు 20,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం ఏడాదికి రూ. 2000 కోట్లు కేటాయించాల్సి వస్తోంది. ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్-ఇన్-ఎయిడ్‌పై ఆధారపడాల్సి వస్తోంది.

రజతోత్సవ వేడుకల వేళ ప్రసార భారతి ముందు రెండు ప్రధాన సవాళ్లున్నాయి. సమాచార సాంకేతికత ద్వారా తన కార్యకలాపాలను మరింత ఆధునీకరించడానికి గత ఐదేళ్ల సంస్కరణల పథాన్ని వేగవంతం చేయాలి. ప్రస్తుత డిజిటల్ యుగానికి చెందిన ప్రేక్షకుల నాడికి తగినట్టుగా.. ఆకట్టుకునే కంటెంట్, సృజనాత్మక కార్యక్రమాలను ప్రసారం చేయాలి. పదవీ విరమణ పొందుతున్న 2000 మంది ఉద్యోగుల స్థానాన్ని నూతన రక్తంతో భర్తీ చేయాలి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవశక్తి పరివర్తన అయిన ఈ పరిణామం అంత తేలికేం కాదు. ఈ మానవ వనరుల నిర్వహణతో పాటు వాణిజ్య నిర్వహణ కోసం అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్, ఐటీ లాంటి ప్రత్యేక విభాగాల్లో సమర్థమైన మానవవనరుల కోసం మరింత బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. పైగా మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రసార భారతి రిక్రూట్‌మెంట్ నియమాలను, చట్టంలోని సంబంధిత నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ సరైన ఫలితాలను ఇచ్చే దిశగా కొనసాగాలి.

రాబోయే రెండు దశాబ్దాలలో పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ భవిష్యత్ దృష్టి 2047 నాటికి నవ భారతదేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఉండాలి. స్మార్ట్‌ఫోన్ల ద్వారా టెక్నాలజీ కన్వర్జెన్స్, మీడియా కంటెంట్ వినియోగం పెరుగుతోంది. బ్రాడ్‌కాస్ట్ ఆటోమేషన్, ఐటీ ఆధార ఇంటిగ్రేషన్ ఈ రంగంలో మరింత కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీడియా కంటెంట్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వినియోగదారులకు సౌలభ్యంగా సేవలు అందించేందుకు క్లౌడ్-ఆధారిత ప్రసార నిర్వహణకు మారడం అనివార్యం అవుతుంది. ఇక చివరగా ఒక పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, అంతర్జాతీయంగా గుర్తింపును విస్తరించుకోవడానికి.. ఆర్కైవల్ కంటెంట్ నుంచి రియల్ ఎస్టేట్ ఆస్తుల వరకు డబ్బు ఆర్జించడానికి ఉన్న కొత్త మార్గాలు అన్నింటిపై దృష్టి సారించాలి. స్మార్ట్‌ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలకు నేరుగా ప్రసారం చేసే వ్యాపార నమూనాగా డైరెక్ట్ మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్, D2Mతో డీడీ ఫ్రీడిష్‌ను రూపొందించడానికి పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌కు అవకాశం ఉంది.

25 సంవత్సరాల నుంచి భారతదేశ స్వయంప్రతిపత్త పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్న ‘ప్రసార భారతి’ కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో అందించిన సేవల ద్వారా విశేష గుర్తింపు పొందింది. ప్రజల్లో సంస్థపై మంచి విశ్వాసం కూడా ఉన్నట్లు ఇటీవలి సర్వేల ద్వారా వెల్లడైంది.

స్పష్టమైన సాంకేతిక దృక్పథం, భవిష్యత్ కోసం మానవశక్తి రోడ్‌మ్యాప్‌తో ఈ బలాలను మరింత సృజనాత్మకంగా నిర్మించుకునే తీరుపైనే రాబోయే 25 సంవత్సరాల్లో సంస్థ మనుగడ ఆధారపడి ఉంటుంది.
– వెంపటి శశి శేఖర్, ప్రసార భారతి మాజీ సీఈఓ

Advertisement

Read Latest National News and Telugu News

Related Articles

Back to top button