police, bihar bride: మరికొన్ని గంటల్లో వివాహం.. పెళ్లికూతుర్ని తుపాకీతో కాల్చి పరారైన పోలీస్.. – bihar cop shoots bride hours before her marriage in munger
తెల్లవారితే పెళ్లి
బిహార్‌లోని ముంగేర్ జిల్లాలోని మహేశ్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ తన కుమార్తె వివాహం ఆదివారం నిశ్చయించాడు. దీంతో పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి కుమార్తె అపూర్వ కుమారి (26) మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఆమె వెనకాలే బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన పోలీస్ అమన్ కుమార్.. వెనక నుంచి అపూర్వ కుమారిని తుపాకీతో కాల్చాడు. దీంతో బుల్లెట్ ఆమెకు ఎడమ భుజంలో నుంచి చొచ్చుకెళ్లి.. కుడివైపు ఛాతి నుంచి బయటకు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అపూర్వ వెనకాలే అమన్ కుమార్ ఉండటంతో వారి కుటుంబ సభ్యులే అనుకున్నట్లు బ్యూటీ పార్లర్ సిబ్బంది తెలిపారు. తర్వాత అమన్ కుమార్ అదే తుపాకీతో తనను తాను కాల్చుకునేందుకు ప్రయత్నించాడని.. దాన్ని తాము అడ్డుకున్నట్లు చెప్పారు. అమన్ కుమార్‌ను పట్టుకునేందుకు యత్నించగా.. అతడు తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులకు వివరించారు.
ఆస్పత్రిలో పెళ్లికూతురు
ఈ ఘటనలో తీవ్రంగా అపూర్వ కుమారీ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడింది. వెంటనే బ్యూటీ పార్లర్ సిబ్బంది అపూర్వను స్థానికంగా ఉన్న సదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. బాధితురాలి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో బాాధితురాలి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల దర్యాప్తు
పెళ్లి కూతురిపై కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. అపూర్వ కుటుంబసభ్యులు, బ్యూటీ పార్లర్ సిబ్బంది నుంచి సమాచారాన్ని సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీలో కనిపించిన దృశ్యాల ఆధారంగా నిందితుడు.. పోలీస్ అని గుర్తుపట్టినట్లు వెల్లడించారు. అమన్ కుమార్ కోసం వేట కొనసాగిస్తున్నామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఘటనాస్థలంలో ఒక తుపాకీ, రెండు లైవ్ క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసలు అపూర్వను కాల్చడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అమన్ కుమార్ బిహార్ పోలీస్ అని.. ప్రస్తుతం పాట్నాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.