News

payyavula keshav, డేటా చౌర్యం చేస్తోంది వైసీపీ ప్రభుత్వమే.. విచారణ కోరే దమ్ముందా: పయ్యావుల – tdp mla payyavula keshav comments on data theft issue


వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. జగన్ సర్కారుకు దమ్ముంటే దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

 

గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో డేటా చౌర్యం జరిగిందని జగన్ సర్కారు చెబుతోందని.. కానీ, ఏం డేటా పోయిందో చెప్పే ధైర్యం మాత్రం ఈ ప్రభుత్వానికి లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ నివేదికలో పెగాసెస్ జరిగిందా? లేదా? అనేదే లేదన్నారు. పెగాసెస్ వాడినట్లు అనుమానం ఉందని కూడా నివేదికలో చెప్పలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వం కొండను తవ్వి చీమను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు.

లేనిది ఉన్నట్లుగా చెప్పాలని హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారని పయ్యావుల కేశవ్ విమర్శించారు. టీడీపీ చెప్తే ఈసీ ఓట్లు తొలగిస్తుందా? అని పయ్యావుల ప్రశ్నించారు. వైసీపీ సర్కార్‌ మాటలతోనే కాలం గడుపుతోందని పయ్యావుల కేశవ్ విమర్శించారు.

ఇప్పుడు ఇంటింటికీ వాలంటీర్లను పంపించి ఆధార్‌ కార్డులు తీసుకుంటూ.. వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోందని పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని.. దమ్ముంటే ఈ కేసు విచారణ కూడా సుప్రీం కోర్టుకు ఇవ్వాలని పయ్యావుల కేశవ్‌ సవాల్ చేశారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button