Pawan Kalyan,Ustaad Bhagat Singh: ఎన్నికల ఎఫెక్ట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇక లేనట్టేనా? క్లారిటీ ఇచ్చేశారు – latest update on pawan kalyan ustaad bhagat singh movie shooting and release date
మొన్నటి వరకూ అయితే నెలకోసారో.. రెండు నెలలకో సారో.. వీకెండ్‌లోనో ఏదొక మీటింగ్ పెట్టి.. అధికార పార్టీపై విమర్శలు గుప్పించి నేనున్నానంటూ గుర్తు చేసేవారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ పార్ట్ టై పాలిటిక్స్ వర్కౌట్ కావు. ఆల్రెడీ.. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో వ్యూహాలకు మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా పార్ట్ టైం పాలిటిక్స్‌కి స్వస్తి పలికి ఫుల్ టైం పొలిటీషియన్‌గా మారాల్సిందే.
అదే జరిగితే ఆయన సైన్ చేసిన సినిమాలకు బ్రేక్ పడ్డట్టే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహరవీరమల్లు’, ‘OG’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మూడు మూడే అన్నట్టుగా భారీ హంగులతో రూపొందుతున్నఈ చిత్రాలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యంగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అయితే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ దర్శకుడు హరీష్ శంకర్.. పొలిటికల్ పంచ్‌లు వేస్తున్నారు. బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ శ్యాంబాబు పాత్రను వదిలారు. ఇది సినీ, పొలిటికల్ సర్కిల్ దుమారాన్ని రేపింది.
అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా పొలిటికల్ పంచ్‌ల దుమారం ఉండబోతుందని ముందే హింట్ ఇస్తూ.. మెడను తెగరుద్దేసుకుంటూ ట్వీట్ పెట్టారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. పొలిటికల్ పంచ్‌లు.. సెటైర్లు ఉండే అవకాశం ఉందని ఓ వెబ్ సైట్ ట్వీట్ చేయడంతో.. దానికి రిప్లై ఇచ్చిన హరీష్ శంకర్.. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ మెడ రుద్దుకునే వీడియోను షేర్ చేసి ఔను అన్నట్టుగా సమాధానం ఇచ్చారు.
దీంతో జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కొబ్బరికాయ కొట్టిన తరువాత.. ఎప్పుడెప్పుడు గుమ్మడికాయ కొడతారా? అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే పూర్తైంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో వాయిదాలపై వాయిదాలు పడుతూనే ఉంది. నిజానికి ఈ సినిమాని వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని అనుకున్నారు. కానీ షూటింగ్ మాత్రం ముందుకు సాగడం లేదు.
పవన్ పొలిటికల్ మీటింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో.. ఆయన సినిమా షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడింది. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చే సంక్రాంతి కాదు కదా.. సమ్మర్‌కి కూడా చేతులెత్తేశారనే రూమర్లు వినిపించాయి.
అయితే వీటన్నింటిపై క్లారిటీ ఇస్తూ పవన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర నిర్మాత (మైత్రి మూవీ మేకర్స్). సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుక నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ అప్డేట్స్‌తో పాటు విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. ‘ఈ సినిమా ఆగిపోలేదని.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని తెలియజేశారు నిర్మాత. వచ్చే ఏడాది సంక్రాంతికి తప్పితే.. సమ్మర్‌కి ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న పుకార్లకు తెరపడింది. ఈనెల మూడో వారం నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తరువాతి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాలో పవన్ పక్కన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.