Pawan Kalyan Varahi,Pawan Varahi Yatra: పవన్‌కు ఏపీ ప్రభుత్వం ఝలక్.. విశాఖలో వారాహి యాత్రకు ఆంక్షలు – pawan kalyan varahi vijaya yatra in visakhapatnam restricted by police
జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు విధించిన ఆంక్షలపై జనసైనికులు మండిపడుతున్నారు. పోలీసుల షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్‌లో స్పందించింది. ర్యాలీలో లేదా సభా వేదిక వద్ద క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, భద్రతకు సహకరించాలని కోరింది.
వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను జనసైనికులు పాటించాలని జనసేన ప్రకటన విడుదల చేసింది. క్రేన్లతో భారీ దండలు, గజమాలలు లాంటివి వేయవద్దని సూచించింది. యాత్ర మార్గంలో క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదని, పవన్ కళ్యాణ్ భద్రతకు భగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.
అయితే మూడో విడత వారాహి యాత్ర 19వ తేదీ వరకు కొనసాగే అవకాశముంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన ప్రకటించింది. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న వేళ పవన్ వారాహి యాత్ర కీలకంగా మారింది. ఈ యాత్రలో చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పనన్ కౌంటర్ ఇచ్చే అవకాశముంది. ఇక గత రెండు విడతల వారాహి యాత్రలో వాలంటీర్లతో పాటు స్థానిక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఈసారి ఎవరిని పవన్ టార్గెట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
విశాఖలోకి పవన్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయనను మంత్రి అమర్ నాథ్ టార్గెట్ చేశారు. చంద్రబాబు సిద్దాంతమే జనసేన సిద్దాంతమని, విశాఖ అభివృద్దిపై పవన్‌కు ఉన్న ఆలోచన ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మేం అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని, గుజావాకలో ఓడిపోయినందుకు వారాహి విజయ యాత్రనా? అని ప్రశ్నించారు. ‘170 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను పవన్ ప్రకటించగలరా? విధానం లేని పార్టీ జనసేన. పవన్ మొదటి అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకే. విశాఖకు చెందిన కాపు బిడ్డను పెళ్లి చేసుకుని మోసం చేశారు. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్’ అని విమర్శించారు.