News

pattabhi, పోలీస్ స్టేషన్‌లో కరెంట్ తీసేసి దారుణంగా కొట్టారు: పట్టాభి – tdp leader pattabhi ram serious allegations against ap police


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పట్టాభి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని ఆరోపించారు. బీసీ వర్గాల వ్యక్తికి మద్దతు తెలిపేందుకు తాను గన్నవరం వెళ్తే.. పోలీసులు అక్రమంగా కేసుల్లో ఇరికించారని తెలిపారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‎లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను కొట్టారని ఆరోపించారు.

తనను పోలీస్ వాహనంలోకి ఎక్కించి ఏ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి 2 గంటల వరకు 200 కిలో మీటర్లు తిప్పారని పట్టాభి పేర్కొన్నారు. తనతో పాటు ఉన్న ఇద్దరు ఎస్ఐలకు ప్రతి 15 నిమిషాలకు ఓ సారి జిల్లా ఎస్పీ ఫోన్ చేస్తారని పట్టాభి చెప్పారు. తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి వ్యవహారమంతా ఎస్పీ డైరెక్షన్‌లోనే నడిచిందని ఆరోపించారు. చివరికి అర్ధ రాత్రి 2 గంటల సమయంలో తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు.

జైలు నుంచి విడుదలైన పట్టాభి

ఊరంతా విద్యుత్ కాంతులతో లైట్లు వెలుగుతుంటే.. ఆ పోలీస్ స్టేషన్‌లో మాత్రం కరెంట్ లేదని, పూర్తిగా చీకటిగా ఉందని పట్టాభి చెప్పారు. దీంతో తనతో పాటు వచ్చిన ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీస్ స్టేషన్‌లో ఎందుకు కరెంట్ లేదని ప్రశ్నించానని తెలిపారు. దీంతో ఏదో పవర్ ఫెయిల్యూర్ కారణమై ఉంటుంది, కరెంట్ వస్తుందలే అంటూ తనను లోపలికి తీసుకెళ్లారన్నారు. లోపల ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరని, స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా ఉందని చెప్పారు. స్టేషన్‌లో తనను ఒక్కరినే కూర్చొపెట్టి మళ్లీ వస్తామని చెప్పి పోలీసులు బయటికి వెళ్లారని ఆరోపించారు.

పోలీసులు వెళ్లిపోయిన 15 నిమిషాలకు ముగ్గురు వ్యక్తులు ముసుగులు వెసుకొని వచ్చి తన ముఖానికి టవల్ చూట్టి ఊపిరి ఆడకుండా చేశారని పట్టాభి వివరించారు. తర్వాత, తనను ఓ గదిలోకి ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారని చెప్పారు. దాదాపు 35 నిమిషాల పాటు తనను చిత్రహింసలకు గురిచేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత తనను అక్కడే వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ముఖానికి ఉన్న టవల్ తీసి చూసేసరికి అప్పటికీ పోలీస్ స్టేషన్‌లో ఎవరూ లేరని చెప్పారు. చివరికి, అతి కష్టం మీద తాను లేచి ఓ కూర్చిలో కూర్చున్న 5 నిమిషాలకు తనను స్టేషన్‌లో దింపి వెళ్లిన ఎస్ఐలు తిరిగి వచ్చారని వివరించారు. ఈ విషయంలో ఎస్పీ పక్కాగా ప్లాన్ అమలు చేశారని పట్టాభి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తనపై ఇప్పటికే నాలుగు సార్లు దాడి జరిగిందని చెప్పారు. అయినా ఈ ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు.

Related Articles

Back to top button