News

Pat Cummins,స్టేడియంలో లక్ష మంది ఫ్యాన్స్ నోరు మూయిస్తాం.. అంతకంటే ఆనందం ఏముంటుంది: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ – nothing more satisfying than hearing big crowd go silent australia captain pat cummins on world cup final


వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుమారు లక్షా 30 వేల మంది ఫ్యాన్స్ స్టేడియానికి తరలివస్తారని అంచనా. అయితే అందులో దాదాపు భారత ఫ్యాన్సే ఉంటారు. ఒకవేళ అక్కడక్కడా ఆస్ట్రేలియా మద్దతు దారులు ఉన్నా.. నీలి సముద్రాన్ని తలపించే స్టేడియంలో వారు కనిపించకపోవచ్చు.

ఈ నేపథ్యంలో రేపు స్టేడియం మొత్తం వన్ సైడెడ్‌గా టీమిండియాకు మద్దతుగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. భారత్ తరఫున మైదానంలోకి దిగేది 11 మందే అయినా.. 140 కోట్ల మంది ప్రజల మద్దతు వారి సొంతం. ఆడేది సొంతగడ్డపై కావడంతో ఆత్మవిశ్వాసం కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది రోహిత్ నేతృత్వంలోని టీమిండియాకు. అయితే టీమిండియాకు లభించే ప్రేక్షకుల మద్దతుపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. గ్రౌండ్‌లోని ప్రేక్షకులు నోళ్లు మూయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

కమిన్స్ మాటల్లో..
‘ఆదివారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో క్రౌండ్ మొత్తం భారత్‌కే సపోర్ట్ చేయనుంది. దీనిపై మాకు ఓ అవగాహన ఉంది. అయితే ఏ గేమ్‌లో అయినా.. మన ప్రత్యర్థి జట్టు అభిమానుల అరుపులను నిశ్శబ్దంలో నెట్టగలిగితే దానంత హ్యాపీ మరొకటి ఉండదు. ఫైనల్ మ్యాచులో మా టార్గెట్ కూడా అదే. అందుకోసం మేం ఇప్పటికే ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాం’ అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

కమిన్స్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. టీమిండియాను ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్‌తోనే ఆస్ట్రేలియా దిగుతున్నట్లు తెలుస్తోంది. లీగ్ దశలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడంతో పాటు ఆరోసారి వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ముద్దాడటానికి వ్యూహాలు రచించినట్లు కనిపిస్తోంది.

ఏదీ ఏమైనా.. ఈ మ్యాచులో గెలిచి మూడో ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయొద్దని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాకౌట్‌ దశలో తమలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసి చివరిదాకా పోరాడేతత్వం ఉన్న ఆస్ట్రేలియాతో జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నారు.

Advertisement

Related Articles

Back to top button