News

Osteoporosis: భారీగా పెరుగుతోన్న ఆస్టియోపోరోసిస్‌ బాధితులు.. వారికే ఎక్కువ ముప్పు.. తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు | Hip fractures to double by 2050, expert says obesity and diabetes major risk factors Telugu Health News


మన శరీర నిర్మాణంలో ఎముకల పాత్ర ఎంతో కీలకం. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత క్షీణిస్తుంది. దీనికి తోడు ఒత్తిడి, ఆరోగ్యకరమైన జీవనశైలి, వివిధ రకాల వ్యాధులు మనిషి ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

మన శరీర నిర్మాణంలో ఎముకల పాత్ర ఎంతో కీలకం. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత క్షీణిస్తుంది. దీనికి తోడు ఒత్తిడి, ఆరోగ్యకరమైన జీవనశైలి, వివిధ రకాల వ్యాధులు మనిషి ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాగా ఎముకల ఆరోగ్యంపై అమెరికాలోని టెక్సాస్‌ వేదికగా అమెరికన్ సొసైటీ ఆఫ్ బోన్ అండ్ మినరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌లో ఫార్మకాలజీ అండ్‌ ఫార్మసీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న చింగ్-లంగ్ చియుంగ్ ఈ సమావేశంలో పాల్గొని ఎముకల వ్యాధులకు సంబంధించి పలు షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు. రోజురోజుకు ఆస్టియోపోరోసిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతుందని, 2050 నాటికి హిప్ ఫ్రాక్చర్ల సంఖ్య రెట్టింపు అవుతుందని, ఇది తమ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నాడు.

రెట్టింపు కానున్న బాధితులు..

కాగా 2005 – 2018 సంవత్సరాల మధ్య సుమారు 19 దేశాల్లో 50 ఏళ్లకు పైగా వయసు ఉండి తుంటి పగుళ్లతో సతమతమైన వివరాలను సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ దేశాల్లో తుంటి పగుళ్ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచ బ్యాంక్ గణంకాల ప్రకారం 2030 – 2050 నాటికి హిప్ ఫ్రాక్చర్ బాధితులు భారీగా పెరుగుతారట. 2018తో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉందట. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. మహిళల్లో కంటే పురుషుల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం హిప్ ఫ్రాక్చర్ ప్రమాదం 50- 84 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో 21.2 శాతం ఉందని, పురుషుల్లో 6.3 శాతం ఉన్నట్లు కనుగొన్నారు.

ఇండియాలోనూ ..

కాగా ఇదే విషయంపై ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అదనపు డైరెక్టర్ డాక్టర్ హరీష్ ఘూటా స్పందించారు. గత దశాబ్ద కాలంగా భారతదేశంలో కూడా తుంటి పగుళ్ల బాధితుల సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు. ‘దేశంలో తుంటి పగుళ్ల కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. దీనిక ప్రధాన కారణం.. బోలు ఎముకల వ్యాధి. క్యాల్షియం లోపంతో ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. సాధారణంగా, బోలు ఎముకల వ్యాధి వయస్సుతో ముడిపడి ఉంటుంది. దీనికి తోడు శారీరక వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల ఆస్టియోపోరోసిస్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. మనదేశంలో వృద్ధుల జనాభా చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు ప్రజల్లో శారీరక శ్రమ లోపించింది. అయితే వైద్య రంగంలో పెరుగుతోన్న సాంకేతికతను ఉపయోగించుకుని ఎక్కువ మంది రోగులకు చికిత్స చేస్తున్నాం. బోలు ఎముకల వ్యాధితో బాధపడేవారిలో వెన్నెముక మాత్రమే కాకుండా తుంటి సమస్యలు కూడా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయం ఉన్నవారు తక్కువ జీవక్రియ రేటును కలిగి ఉంటారు. శారీరక శ్రమ కలిగి ఉండరు. అలాంటి వారిలో కీళ్ల నొప్పులు, ఎముకల వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి’ అని డాక్టర్‌ చెప్పుకొచ్చారు.

క్యాల్షియం, మాంసకృత్తులు, విటమిన్‌డి..
కాగా పోషకాహారం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చుని డాక్టర్ హరీష్ సూచిస్తున్నారు. కాల్షియం, మాంసకృత్తులతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చు. అలాగే 40-50 ఏళ్ల మధ్య ఉన్న వారు కచ్చితంగా శారీరక వ్యాయామాలు చేయాలి. ఇక ఆస్టియోపోరోసిస్ విషయంలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానిని ముందుగా గుర్తించాలి. దీని కోసం, డెక్సా స్కాన్, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనే రెండు పరీక్షలు ఉన్నాయి. అయితే ఈ పరీక్షలు కేవలం వైద్యుల సలహాల మేరకు మాత్రమే తీసుకోవాలి. కాగా భారతదేశం ఉష్ణమండల దేశమైనప్పటికీ, విటమిన్ డి లోపం ఉన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందువల్ల బోలు ఎముకల వ్యాధి బాధితులు పెరుగుతున్నారు “ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డి ఉత్తమ, సహజమైన మూలం. అయితే మన దేశంలోని చాలామందిలో ఈ విటమిన్ లోపం ఉంది. ఈ విటమిన్‌ను గ్రహించడానికి ఉత్తమ మార్గం ఎండలో ఉండటమే. అయితే చాలా మంది ఇంటి లోపల, ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో పని చేస్తున్నారు. విటమిన్‌ డి పోషణ కోసం ఆర్థోపెడిక్ లేదా జనరల్ ఫిజిషియన్ సూచించిన కొన్ని సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు’ అని డాక్టర్ ఘూటా తెలిపారు

Advertisement

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండిలేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button