News

Ongole Bull Death, వలలో చిక్కుకుని ఒంగోలు జాతి ఎద్దు మృతి.. ఉగాది పోటీలకు తర్ఫీదు పొందుతూ..! – ongole breed bull sudden death in east godavari district


ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పోటీల్లో పాల్గొనేందుకు తర్ఫీదు పొందుతుండగా చెరువులో వలలో చిక్కుకొని ఓ ఎద్దు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మురమండ మొగలపు చిన్నకు చెందిన ఈ ఎద్దు.. పట్టు ప్రదర్శనలు ఇవ్వడంలో దిట్ట. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోటీకి వెళ్లినా బహుమతి గెలుచుకునే సత్తా దీని సొంతం. ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా దుళ్ల నందీశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి ఏటా జరిగే ఎడ్ల పోటీలో బహుమతి గెలుచుకునేందుకు తర్ఫీదులో భాగంగా చెరువులో ఈతకు దింపారు.

అయితే అంతకుముందు ఆ చెరువులో చేపల కోసం కొంగలు వాలకుండా ఉండేందుకు ఓ ప్లాస్టిక్ వల ఏర్పాటు చేశారు. ఆ విషయం రైతుకు తెలియక చెరువులో దింపడంతో ఆ వలలో ఎద్దు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ఎద్దును రక్షించేందుకు చుట్టుపక్కల రైతులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఎద్దు మాపురం పై సుడి ఉండడం వల్ల సదరు రైతు కుటుంబం దైవంగా కొలుచుకునేవారు. మాపురంపై నుడి ఉండటం వల్ల ఆ ఎద్దుకు ‘నంది’ అనే పేరు పెట్టారు. ఆ ఎద్దును లక్షల రూపాయలతో కొనుగోలు చేయడానికి పలువురు ముందుకు వచ్చినప్పటికీ అమ్మడానికి రైతు ఇష్టపడలేదు. కానీ, ఈ ఎద్దు ప్రమాదవశాత్తూ మరణించడం పట్ల సదరు రైతు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇక, ఈ ఎద్దు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 28 బహుమతులు గెలుచుకుంది. 18 సంవత్సరాల వయసున్న ఈ ఎద్దు పదో సంవత్సరం నుంచే పందేలకు సిద్ధమైంది. అలాంటి ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే సాంప్రదాయబద్ధంగా ఖననం చేశారు.

Related Articles

Back to top button