Entertainment

CBN-NTR: ట్విటర్ పలకరింపులు.. తెలుగు తమ్ముళ్ల పులకరింతలు.. తారక్ ఆప్యాయతే మెయిన్ థీమ్


ఒక్క ట్వీట్… తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్‌ను తీసుకొచ్చిందా…? మళ్లీ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చిందా…? విభేదాలున్నాయంటూ వచ్చిన ఎన్నో వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టిందా..? మామ-అల్లుళ్ల మధ్య జరిగిన ఆ స్వీట్ నథింగ్స్ ఏంటి..? అసలు ఆ సందర్భానికి దారి తీసిన పరిస్థితులేంటి?

ట్రిపుల్ ఆర్ మూవీకి…. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అస్సలు సంబంధం లేదు. కానీ… అదే సినిమా ఇప్పుడు టీడీపీ నేతలకు కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లూ ఎడ మొహం..పెడ మొహంగా అందరికీ కనిపించిన చంద్రబాబు నాయుడు- తారక్‌ల మధ్య ట్విటర్ వేదికగా జరిగిన ఆప్యాయతతో కూడిన సంభాషణ అభిమానుల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ కొత్త ఆశల్ని మోసుకొచ్చినట్టు కనిపిస్తోంది. RRRలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ రావడంతో విషెస్ చెబుతూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. అందుకు ప్రతిస్పందనగా థాంక్యూ మామయ్యా.. అంటూ ఆప్యాయంగా ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శుభాకాంక్షలు సహజం, దానికి ప్రతిస్పందన కూడా సహజం. కానీ జూనియర్ పెట్టిన ట్వీట్‌లో ఆప్యాయతా కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు.. !

చంద్రబాబు.. తారక్ మధ్య విబేధాలపై ఎప్పటి నుంచో ప్రచారాలు జరుగుతున్నాయి. చంద్రబాబు సభలు, సమావేశాల్లో చాలాసార్లు ఎన్టీఆర్‌ సీఎం అంటూ నినాదాలు వినిపించాయి. కానీ ఏ రోజూ, ఏ నినాదానికీ ఎన్టీఆర్ స్పందించలేదు, అలాగని ఖండించనూ లేదు. దీంతో వారిద్దరి అనుబంధంపై రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఆ ప్రచారాలన్నింటికీ ఈ గోల్డెన్ ట్వీట్ ఫుల్ స్టాప్ పెట్టిందన్నది మెజార్టీ టీడీపీ కార్యకర్తలు, నేతల భావన.

2009 ఎన్నికల్లో టీడీపీ కోసం చంద్రబాబుతో కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేశారు. ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌ వస్తుండగానే ఖమ్మం జిల్లాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కారుకు ప్రమాదం జరిగింది. అప్పట్లో జూనియర్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు కూడా. కానీ ఆ ఎన్నికల తర్వాత తారక్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. కానీ ఎప్పటికప్పుడు తారక్‌ ప్రస్తావనను అభిమానులు, కార్యకర్తలు అటు చంద్రబాబు దగ్గర, ఇటు తారక్‌ దగ్గర తీసుకొస్తునే ఉన్నారు. కానీ పెద్దగా ప్రయోజన లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ఆప్యాయతతో కూడిన ట్వీట్‌తోనైనా మామ-అల్లుళ్లు కలుస్తారమోనన్నది టీడీపీ జనం ఆశ. మరి వాట్ నెక్ట్స్… దీనికి సమాధానం జస్ట్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button