News

nellore lorry driver, చుక్కలు చూపించిన టిప్పర్‌ డ్రైవర్‌.. మద్యం మత్తులో వీరంగం! – lorry driver drunk and drive and hit vehicles in nellore district


నెల్లూరు జిల్లాలో ఓ లారీ డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద లారీ డ్రైవర్ మద్యం మత్తులో టిప్పర్‌ లారీ నడిపి వాహనాలను ఢీకొట్టాడు. స్థానికులు, వాహనదారులు కలిసి ఆ లారీని వెంబడించడంతో సంగం కనిగిరి రిజర్వాయర్‌ వద్ద లారీ ఆపేసి కాలువలో దూకి పరారయ్యాడు. అయితే, సుమారు కిలో మీటరు దూరం వరకు ఈత కొడుతూ వెళ్లిన డ్రైవర్‌ను గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామానికి చెందిన చల్లా కృష్ణ టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో టిప్పర్‌తో పొదలకూరు మీదుగా వింజమూరుకు బయల్దేరాడు. ఈ క్రమంలో పొదలకూరు మండలం అయ్యగారిపాలెం సమీపంలో ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టాడు.

అంతటితో ఆగకుండా తాటిపర్తి కలుజు సమీపంలో ఒక గేదెను, తాటిపర్తి బస్టాండులో ఒక ఆటోను వేగంగా ఢీకొట్టి దూసుకెళ్లాడు. దీంతో స్థానికులు టిప్పర్‌ను వెంబడించారు. ఈ క్రమంలో సంగం కనిగిరి రిజర్వాయర్‌ వద్ద డ్రైవర్ లారీ ఆపి కాల్వలోకి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కరీముల్లా తెలిపారు.

Related Articles

Back to top button