News

national herald case, Rahul Gandhi: కొత్త పాస్‌పోర్టు కోసం కోర్టుకెళ్లిన రాహుల్ గాంధీ.. వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ.. – bjp mp subramanian swamy opposes rahul gandhi fresh passport plea in delhi court


Rahul Gandhi: విదేశీ పర్యటనకు వెళ్లనున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొత్త పాస్‌పోర్టు కోసం కోర్టుకు వెళ్లారు. సాధారణ పాస్‌పోర్టు పొందేందుకు తనకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది. అయితే కొత్త పాస్‌పోర్టు కోసం రాహుల్‌ గాంధీ కోర్టును ఆశ్రయించడాన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించారు. రాహుల్‌ గాంధీ నేషనల్‌ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్నారని.. ప్రస్తుతం ఆయనను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి పాస్‌పోర్టు ఇవ్వకపోవడమే మంచిదని పరోక్షంగా కోర్టుకు విన్నవించారు.

కొత్త పాస్‌పోర్టు ఎందుకు
మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో దౌత్య పాస్‌పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించాల్సి వచ్చింది. దీంతో విదేశాలకు వెళ్లేందుకు రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నేషనల్‌ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్న రాహుల్ పాస్‌పోర్టు జారీ కోసం నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని దిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసు
నేషనల్‌ హెరాల్డ్ కేసులో రాహుల్‌ గాంధీతో పాటు మరికొందరికి 2015 డిసెంబరు 19 న దిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల 31 నుంచి పది రోజులపాటు రాహుల్‌ గాంధీ అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారని హస్తం శ్రేణులు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కొత్త పాస్‌పోర్టు పొందేందుకు.. కోర్టు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తుందా లేదా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Back to top button