News

Naseem Shah,పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ.. వరల్డ్‌ కప్‌కు కీలక బౌలర్ దూరం! – pakistan bowler naseem shah likely to be ruled out of icc world cup 2023


ఆసియా కప్ టోర్నీలో భారీ ఆశలతో బరిలోకి దిగిన పాకిస్థాన్ అనూహ్యంగా ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. సూపర్-4 దశలో భారత్, శ్రీలంక చేతిలో ఓడి తుది పోరుకు అర్హత సాధించకుండానే నిష్క్రమించింది. ఇప్పటికే బాధలో ఉన్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో మ్యాచు సందర్భంగా గాయపడ్డ యువ పేసర్ నసీమ్ షా.. ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. అతడు కోలుకునేందుకు కనీసం కొన్ని వారాలు పడుతుందని తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్‌కు 20 రోజులు కూడా లేని ప్రస్తుత పరిస్థితిలో అతడు మెగా టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది.

సెప్టెంబ‌ర్ 11న టీమిండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో న‌సీం షా భుజం గాయమైంది. పాక్ బౌలింగ్ సమయంలో 46వ ఓవ‌ర్ స‌మ‌యంలో నొప్పితో మైదానం వీడిన అత‌ను ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో నసీం గాయం తీవ్రతను తెలుసుకునేందుకు దుబాయ్‌లో స్కానింగ్ నిర్వహించారు. ఊహించిన దాని కంటే కూడా గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని సమాచారం. దీంతో వన్డే వరల్డ్‌ కప్‌తో మరి కొన్ని నెలలపాటు అతడు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అన్ని ఫార్మాట్లలో కీలక బౌలర్‌గా
20 ఏళ్ల నసీం షా అనతి కాలంలోనే పాకిస్థాన్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2019లోనే పాకిస్థాన్ జట్టు తరఫున టెస్టుల్లో డెబ్యూ చేశాడు. ఆ తర్వాత తన ప్రదర్శనతో అన్ని ఫార్మాట్‌లలో కీలక బౌలర్‌గా మారాడు. కానీ, వరుసగా మ్యాచులు ఆడటం అతడి కెరీర్‌పై ప్రభావం చూపింది. 18 నెల‌ల క్రితం ఈ యువ బౌలర్‌ వెన్నుముకకు గాయమైంది. తర్వాత కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. షాహీన్ అఫ్రిదీ, హరీస్ రవూఫ్‌లతో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఆసియా కప్ లీగ్ దశలో భారత్‌తో మ్యాచులో మూడు వికెట్లు తీశాడు.

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి ముందు కీలక ప్లేయర్ దూరం కావడం పాక్‌కు ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టోర్నీలో భాగంగా పాకిస్థాన్ అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచు ఆడనుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచు అక్టోబర్ 14న జరగనుంది.

నసీం షా వన్డే వరల్డ్ కప్ నాటికి కోలుకోకపోతే.. అతడి ప్లేసులో ఎవర్ని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్‌లో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన జమాన్ ఖాన్.. పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జట్టు ఎంపిక పాకిస్థాన్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

Related Articles

Back to top button