Nara Lokesh Padayatra Conditions, నారా లోకేష్ పాదయాత్రకు అనుమతులు.. పోలీసుల షరతులు ఇవే, మూడ్రోజులకు! – police gives permission to nara lokesh yuvagalam padayatra with these conditions
పలమనేరు పరిధిలో మూడు రోజుల పాటూ పాదయాత్ర కొనసాగనుంది. 27 నుంచి 29 సాయంత్రం 5.55 గంటల వరకు మూడు రోజుల పాటే ఇది వర్తిస్తుందని పోలీసులు తెలిపారు. లోకేష్ పాదయాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పిస్తామన్నారు ఎస్పీ రిషాంత్‌రెడ్డి. మొత్తం 29 ఆంక్షలు విధించి పాదయాత్రకు అనుమతులిచ్చినట్లు సాగుతున్న ప్రచారం వాస్తవం లేదన్నారు. పాదయాత్రకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. లోకేష్ పాదయాత్ర పై వస్తున్న అసత్య ప్రచారం పూర్తిగా అవాస్తమని.. పోలీస్ శాఖ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. రోడ్లపై సభలు నిర్వహించకుండా పాదయాత్ర చేపట్టాలన్నారు. పాదయాత్ర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లోకేష్ పాదయాత్ర జిల్లా నుంచి వెళ్లేంతవరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
అలాగే పోలీసుల నిబంధనల్లో 15 పాదయాత్రకు.. మరో 14 కుప్పం బహిరంగ సభకు సంబంధించినవని ఎస్పీ వివరణ ఇచ్చారు. పాదయాత్రకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా ఈ నిబంధనల్ని అనుసరించాలని.. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలు నిర్వహించకూడదన్న నిబంధన ఒక్కటే కొత్తగా వచ్చిందన్నారు. మిగతావన్నీ సాధారణంగా విధించేవని.. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే వీటిని అమలు చేస్తామన్నారు రిషాంత్ రెడ్డి. పాదయాత్ర వెంట పోలీసులు, రోప్ పార్టీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే పాదయాత్ర నిర్వాహకులు కొంత బాధ్యత తీసుకుని.. వాలంటీర్లను నియమించుకుంటే బాగుంటుందని సూచించామన్నారు. అభ్యంతరాలుంటే చర్చించొచ్చు.. ఒకవేళ మినహాయింపులు కావాలంటే.. ఆమోదయోగ్యంగా ఉంటే ఇస్తామన్నారు.
ప్రధానంగా నిబంధనల్లో రోడ్లపై బహిరంగ సభలు నిర్వహించొద్దని సూచించారు. బహిరంగ సభ నిర్వహించుకోవడానికి తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ వివరాలు పోలీసులకు అందజేయాలన్నారు. రోడ్‌షో, పాదయాత్రలను సభలా మార్చొద్దన్నారు. అలాగే యాత్రలో డీజే సిస్టమ్స్, లౌడ్ స్పీకర్ల వినియోగం పూర్తి నిషేధించారు.. సింగిల్ సౌండ్ బాక్స్ సిస్టమ్‌ను తక్కువ శబ్దంతో వినియోగించాలని సూచించారు. టపాసులు కాల్చకూడదని.. ఫ్లయింగ్ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి చిత్రాలు తీయాలంటే డ్రోన్ నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. అనుమతించిన వాహనాలే పాదయాత్రలో ఉండాలని.. అంతకంటే మించకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయొద్దు. సభ ఏర్పాటు చేస్తే అదనంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తొక్కిసలాట జరగకుండా సభాస్థలిలో పటిష్ఠంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే మరికొన్ని నిబంధనలు ఉన్నాయి.
- Read Latest Andhra Pradesh News and Telugu News