ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విద్యుత్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. వరుసగా విద్యుత్ తీగలు ఎందుకు తెగిపడుతున్నాయో చెప్పాలని నిలదీశారు. ఏపీలో విద్యుత్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరు? వారికి ఆ కాంట్రాక్టులు ఇప్పించిన ప్రభుత్వ పెద్దలు ఎవరని ప్రశ్నించారు. తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు చనిపోవడం, పలువురి పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమని లోకేష్ అన్నారు. నాలుగు రోజుల క్రితమే కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిపడి కాలికి తగలడంతో ముగ్గురు రైతులు మరణించారని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రతి సారి ఉడుత కథ చెప్పి తప్పించుకోవడం, దేవుడి ఖాతాలో వేసి చేతులు దులుపుకోవడం జగన్ సర్కార్‌కి అలవాటుగా మారిందన్నారు.
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని లోకేష్ అన్నారు. విద్యుత్ తీగలు తెగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రమాదంలో చనిపోయిన కూలీల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చనిపోయిన కూలీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని లోకేష్ కోరారు. నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ లోపాలపై తక్షణమే అధ్యయనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.