News

nara lokesh, జగన్ రెడ్డి అలా అనే అవకాశమే లేదు.. అన్నీ రికార్డెడ్‌గా ఉన్నాయ్: లోకేష్ – nara lokesh fires on ap cm ys jagan over electricity employees


రాష్ట్రంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్ మేరకు వెంటనే వారిని క్రమబద్ధీకరించాలని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో థ‌ర్డ్ పార్టీ వ్యవ‌స్థను ర‌ద్దు చేసి.. యాజ‌మాన్యమే స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు సోమవారం నారా లోకేష్ లేఖ రాశారు. కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. ప్రతిప‌క్షనేత‌గా అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల కోసం ఆనాడు కార్చింది మొస‌లి క‌న్నీరని అర్థమవుతోందన్నారు.

వైసీపీ ప్రభుత్వం వ‌చ్చిన వెంట‌నే విద్యార్హత‌, అనుభ‌వం, స‌ర్వీసును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రెగ్యుల‌ర్ చేస్తామ‌ని, యాజ‌మాన్యానికి-కార్మికుల‌కు మ‌ధ్య ఉన్న ద‌ళారీ వ్యవ‌స్థను ర‌ద్దు చేసి విద్యుత్ సంస్థ నుంచే జీతాలు ఇప్పిస్తామ‌ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తాను హామీ ఇవ్వలేద‌ని అనేందుకు అవకాశం లేకుండా అన్నీ రికార్డెడ్‌గా ఉన్నాయని లోకేశ్‌ గుర్తు చేశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి మోస‌పూరిత హామీలిచ్చి, అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటిపోయిందని నారా లోకేష్ అన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల‌కు ఇచ్చిన హామీని ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని నెర‌వేర్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ద‌శాబ్దాల కాలంగా ఏపీ ట్రాన్స్‌కో, జెన్ కో, డిస్కంల్లో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగ‌ భ‌ద్రత లేకుండా ప‌నిచేస్తున్నారని చెప్పారు. ప్రతిప‌క్ష నేత‌గా ఉన్నప్పుడు మీ అడుగులో అడుగేసి మీ వెంట న‌డిచిన వారిని సీఎం అయ్యాక విస్మరించ‌డం సరికాదని విమర్శించారు. తెలంగాణలో కాంట్రాక్టు కార్మికుల‌ను విద్యుత్ సంస్థలో విలీనం చేసుకుని ప్రొబేష‌న‌రీ కాలం ముగిశాక 24 వేల‌ మందికి పైగా కార్మికులను రెగ్యుల‌ర్ చేశారని.. అర్హత వ‌య‌స్సు దాటిపోతుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

Related Articles

Back to top button